TTD Laddu Adulteration: గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో లడ్డూల తయారీలో ప్రాణాలు తీసే రసాయనాలు వాడారని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడారని.. కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారని మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం ఆరోపణలపైపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కల్తీ నెయ్యితో సుమారు 20.1 కోట్ల లడ్డూలను తయారు చేశారని బీఆర్ నాయుడు తెలిపారు. ఇది భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని వ్యాఖ్యానించారు.
సీబీఐ పర్యవేక్షణలోని సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం) దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో నెయ్యిలో జంతువుల కొవ్వులు లేవని ఎక్కడా నిర్ధారణ కాలేదని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. లడ్డూల తయారీలో ప్రాణాలు తీసే స్థాయిలోని ప్రమాదకరమైన రసాయనాలను వాడారని మండిపడ్డారు. నెయ్యిలో 100 శాతం కల్తీ జరిగిందని ఆరోపించారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/female-constable-died-in-warangal/
కేవలం కమీషన్ల కోసమే తక్కువ నాణ్యత కలిగిన నెయ్యిని సరఫరా చేసే కంపెనీలకు టెండర్లు ఇచ్చారని బీఆర్ నాయుడు ఆరోపణలు చేశారు. భక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ వారికి అనుగుణంగా నివేదికలు తయారు చేయించుకుంటున్నారని విమర్శించారు. కల్తీ నెయ్యి సరఫరా ద్వారా గత ఐదేళ్లలో టీటీడీకి సుమారు రూ. 234 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని సిట్ దర్యాప్తులో తేలిందని ఆయన వివరించారు.

