తిరుపతి(Tirupati)లో వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు మరణించడంపై వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్ష మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ వైఫల్యం కారణంగా జరిగిన తొక్కిసలాటలో పలువురు ప్రాణాలు కోల్పోవడం, పదుల సంఖ్యలో భక్తులు గాయపడడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు వైసీపీ తరుపున నివాళులర్పిస్తున్నామని తెలిపారు. ఎంతో భక్తిశ్రద్దలతో ఉండాల్సిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు మీడియా పిచ్చి, రాజకీయ పిచ్చి ఎక్కువని ఆరోపించారు. టీటీడీ ఛైర్మన్‌గా ఆయన పూర్తిగా విఫలమయ్యారని తెలిపారు.
కూటమి ప్రభుత్వంలో టీటీడీని పూర్తిగా రాజకీయ వేదికగా మార్చారని ధ్వజమెత్తారు. గతంలో జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఏ రోజూ ఇలాంటి తప్పు జరగలేదని గుర్తు చేశారు. తొక్కిసలాట మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తార అని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటుంటారని.. మరి ఇప్పుడు ఏమయ్యారని నిలదీశారు. పరిపాలనా వైఫల్యం వల్లే ఈ తప్పిదం జరిగిందని విమర్శించారు. ఈ ఘటలను నైతిక బాధ్యత వహిస్తూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీటీడీ ఛైర్మన్ ముగ్గురిలో ఎవరు రాజీనామా చేస్తారో చెప్పాలని విరూపాక్ష డిమాండ్ చేశారు.