Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్TTD: త్వరలో ఉద్యోగులకు ఇళ్లస్థలాలు

TTD: త్వరలో ఉద్యోగులకు ఇళ్లస్థలాలు

విశ్వవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మప్రచారం

స్వాతంత్య్ర దినోత్సవ సభలో టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి సనాతన హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు కృషి చేస్తామని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఉద్యోగులకు త్వరలోనే ఇళ్ల స్థలాలు అందజేస్తామని తెలియజేశారు. భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు. భద్రతా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి ఛైర్మన్ ప్రసంగించారు. వారి మాటల్లోనే… శ్రీవారి ఆశీస్సులతో అందరికీ 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రీమహావిష్ణువు స్వయంభుగా వెలసిన ప్రదేశం తిరుమల. టీటీడీలో సేవలందించడం ఉద్యోగుల జన్మజన్మల పుణ్యఫలం. హిందూ ధర్మాన్ని పాటించే హిందువులందరికీ టీటీడీ పెద్దదిక్కుగా నిలుస్తోంది.

  • ఎందరో మహానీయుల త్యాగాల ఫలితంగా నేడు మనమంతా బానిస సంకెళ్లు తెంచుకుని స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నాం.
  • ఆ మహానుభావుల బలిదానాలను  నిత్యం మననం చేసుకుంటూ దేశంలో శాంతి, సౌభ్రాతృత్వాలు నెలకొల్పడానికి ప్రతి ఒక్కరు అకుంఠిత దీక్షతో పని చేయాలి.
  • ఇదే స్ఫూర్తితో టీటీడీలోని అధికారులు, ఉద్యోగులందరూ భక్తుల సేవలో తరించాలని కోరుతున్నాను.
  • హైందవ సనాతన ధర్మవ్యాప్తికి ఆళ్వారుల కాలం నుంచి ఇప్పటివరకు టీటీడీ ఎన్నో సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
  • దర్శనంతో సంబంధం లేకుండా కొండ మీదకు వచ్చిన ప్రతి భక్తుడు రెండు పూటల కడుపు నిండా భోజనం చేసే అవకాశం టీటీడీ కల్పించింది.
  • సర్వదర్శనంలో స్వామివారి దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడికి ఉచితంగా ఒక చిన్న లడ్డు ఇచ్చే కార్యక్రమం టీటీడీ ప్రారంభించింది.
  • మత మార్పిడులకు అడ్డుకట్ట వేసేందుకు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారితో పాటు శ్రీదేవి, భూదేవిని దళితవాడలకు తీసుకెళ్ళి అక్కడే కల్యాణం నిర్వహించి వారికి స్వామివారి ఆశీస్సులు అందజేసే దళిత గోవిందం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
  • భగవంతున్నే భక్తుల దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆశీస్సులు అందించేలా, స్వామివారి కల్యాణాన్ని వారంతా చూసి ఆనందించేలా  శ్రీనివాస కళ్యాణాలు పెద్ద ఎత్తున నిర్వహించింది.
  • పిల్లల పెళ్ళిళ్ళకు అప్పులు చేసి ఆర్థికంగా చితికి పోతున్న పేద, మధ్య తరగతి వర్గాల వారికి చేయూతనివ్వడానికి నిర్వహించిన కార్యక్రమమే కళ్యాణమస్తు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో 32 వేలకు పైగా జంటలకు స్వామివారి సమక్షంలో పెళ్ళిళ్ళు చేసి ఆయన ఆశీస్సులు అందింపజేసింది.
  • శ్రీ వేంకటేశ్వర స్వామివారి వైభవాన్ని, సనాతన హైందవ ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయడం కోసం శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ ఏర్పాటు చేసింది. ఛానల్ కు ప్రస్తుతం 8 కోట్ల మంది వీక్షకులు ఉన్నారు.
  • దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారి సంపూర్ణ సహకారంతో వేద పరిరక్షణకు టీటీడీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశాం.
  • అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి గారి ఆశీస్సులతో అర్హులైన ఉద్యోగులందరికీ ఇంటి స్థలాలు ఇచ్చాము.
  • ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆశీస్సులతో అర్హులైన ఉద్యోగులందరికీ త్వరలో ఇంటి స్థలాలు ఇస్తాం. ఇందుకోసం 430 ఎకరాల స్థల సేకరణ పూర్తయింది.
  • ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే నేను, ఈవోతో కలిసి వడమాల పేట వద్ద ఉద్యోగులకు కేటాయించిన భూమి పరిశీలనకు వెళుతున్నాను. వీలైనంత త్వరగా ముఖ్యమంత్రివర్యుల చేతులమీదుగా ఇంటి స్థలాలు అందిస్తాం.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News