Sunday, January 18, 2026
Homeఆంధ్రప్రదేశ్TTD Project: టీటీడీ వినూత్న ప్రయోగం.. దేశంలోనే తొలి 'దివ్య వృక్షాల' ప్రాజెక్టుకు అంకురార్పణ

TTD Project: టీటీడీ వినూత్న ప్రయోగం.. దేశంలోనే తొలి ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టుకు అంకురార్పణ

TTD first Divine Trees project in the country was inaugurated: ప్రసిద్ద పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వినూత్నమైన ప్రాజెక్టును చేపట్టింది. టీటీడీ ఆలయాల్లోని ధ్వజస్తంభాల కోసం ప్రత్యేకంగా ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టును ప్రారంభించింది. దేశంలోనే ఇది ప్రత్యేకమైన, ఆధ్యాత్మికతతో పాటు పర్యావరణ పరిరక్షణను అందించే ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ వృక్షాలను పెంచి, భవిష్యత్తులో ఆలయాల్లో ధ్వజస్తంభాల కోసం ఉపయోగిస్తారని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా శాస్త్రోక్తంగా కొత్త ధ్వజస్తంభాలను ఏర్పాటు చేస్తారు. ధ్వజస్తంభం కేవలం నిర్మాణం మాత్రమే కాదు భౌతిక లోకానికి, దైవ లోకానికి మధ్య ఉన్న శాశ్వత బంధాన్ని సూచిస్తుంది. అందుకే, ఆలయాల్లో నిలిచే ధ్వజస్తంభం భక్తి, పవిత్రత, దైవ సన్నిధిని ప్రతిబింబిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఆగమశాస్త్రాల ప్రకారం, ధ్వజస్తంభం ఒకే చెట్టుకు చెందిన పవిత్ర వృక్ష కాండంతో తయారు చేయాల్సి ఉంటుంది. సాధారణంగా టేకు, ఏగిశా/ఇండియన్ కినో, టెర్మినేలియా, షోరియా జాతి వృక్షాలు దీని తయారీలో ఉపయోగిస్తారు. ఇవి బలంగా, దీర్ఘకాలం నిలిచే స్వభావం కలిగి ఉంటాయి. దివ్య వృక్షం పరిపక్వతకు చేరిన తర్వాత దాన్ని శాస్త్రోక్తంగా పూజించి, ఆపై ధ్వజస్తంభంగా రూపకల్పన చేసి, దేశవ్యాప్తంగా ఉన్న 60 టీటీడీ ఆలయాల్లో ప్రతిష్ఠిస్తారు. తర్వాత స్వర్ణ కవచంతో అలంకరించి, గరుడ ధ్వజాన్ని ఆవిష్కరిస్తారు.

- Advertisement -

100 ఎకరాల విస్తీర్ణంలో ప్రాజెక్టు..

కాగా, ప్రస్తుతం టీటీడీ దేశవ్యాప్తంగా 60కి పైగా ఆలయాలను నిర్వహిస్తుంది. భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్మించే ఆలయాలకు అవసరమైన ధ్వజస్తంభాలను ముందుగానే సిద్ధం చేయడానికి ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ధ్వజస్తంభాలకు అవసరమైన పవిత్ర కలపను టీటీడీ స్వయంగా పెంచి సంరక్షిస్తుంది. ఇది ఆగమ సంప్రదాయాన్ని, ఆధ్యాత్మిక పవిత్రతను, పర్యావరణ పరిరక్షణను తరతరాలకు అందిస్తుంది. దేశంలోనే తొలి దివ్య వృక్షాల ప్రాజెక్ట్‌గా పేరొందింది. టీటీడీ రాజగోపురం, గర్భగుడి విమానం మధ్య పవిత్ర ప్రదేశంలో ప్రతిష్ఠించే ఈ ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని సైతం ఆవిష్కరిస్తారు. టీటీడీ సాలకట్ల బ్రహ్మోత్సవాలను ప్రారంభించే క్రమంలో ఈ ధ్వజారోహణం సమస్త లోకాన్ని, దేవతలను ఆహ్వానించే శుభ సూచకంగా భావిస్తారు. ప్రస్తుతం, దేశవ్యాప్తంగా 60కి పైగా ఆలయాలను నిర్వహిస్తున్న టీటీడీ.. భవిష్యత్తులో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయాలను ఆగమ నియమాలకు అనుగుణంగా నిర్మించే బాధ్యతను నిర్వహిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ దివ్య వృక్షాల ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో భాగంగా సుమారు 100 ఎకరాల స్థలాన్ని దివ్య వృక్షాలు పెంచేందుకు కేటాయించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు అమలుతో ధ్వజస్తంభాల కోసం అవసరమైన దివ్య వృక్షాలను స్వయంగా పెంచే తొలి దేవాలయ సంస్థగా టీటీడీ రికార్డుకెక్కనుంది. దీని ద్వారా ఆగమ శుద్ధి, ఆధ్యాత్మిక పవిత్రత, పర్యావరణ బాధ్యత, సంస్థాగత స్వావలంబనను తరతరాలకు కొనసాగిస్తామని టీటీడీ పేర్కొంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News