Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్TTD: టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు!

TTD: టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు!

TTD Key decisions: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి ఈరోజు సమావేశమైంది. మంగళవారం జరిగిన ఈ సమావేశంలో పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఈవో బీ.శ్యామలరావు మీడియాతో పంచుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-3 నిర్మాణ అంశాన్ని చర్చించినట్లు తెలిపారు. కమిటీ నివేదికపై ఆధారపడి తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని చెప్పారు.

- Advertisement -

అలిపిరి వద్ద మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. శిలాతోరణం, చక్రతీర్ధం ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ఈ సమావేశంలో ఆమోదం లభించింది. దేశవ్యాప్తంగా ఆలయ నిర్మాణాలను అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిటీని నియమించనున్నట్లు చెప్పారు. శ్రీవారి సేవను ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు కోఆర్డినేటర్ల నియామకాన్ని ఆమోదించినట్టు వివరించారు. సైబర్ భద్రత కోసం ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

తిరుమల పరిపాలనకు కొత్త భవనాన్ని నిర్మించాలన్న నిర్ణయం తీసుకున్నారు. పాత భవనాలను తొలగించి వాటి స్థానంలో ఆధునిక సదుపాయాలతో కొత్త నిర్మాణాలు చేపట్టనున్నారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో త్వరలో అన్నదాన కార్యక్రమం ప్రారంభించనున్నారు. ఇందుకోసం రూ. 4.7 కోట్లు వెచ్చించి కొత్త భవనం నిర్మించనున్నారు. 320 ఆలయాలకు మైక్ సెట్లు అందజేయాలని నిర్ణయించగా, 700 మంది వేద పారాయణదారులను నియమించేందుకు రూ. 18 కోట్లు కేటాయించనున్నారు. అలాగే, 600 మంది వేద పారాయణదారులకు నిరుద్యోగ భృతి ఇవ్వడానికి కూడా ఆమోదం లభించింది. శ్రీవాణి ట్రస్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని పలు ఆలయాల్లో భజన మండపాల నిర్మాణానికి అనుమతినిచ్చారు. ఈ నిర్ణయాలన్నీ తిరుమలలో భక్తుల సౌలభ్యానికి తోడ్పడతాయని, దేవస్థాన అభివృద్ధిలో ఇది మరో ముందడుగు అవుతుందని అధికారులు పేర్కొన్నారు.

ఈ సమావేశంలో టీటీడీ మొత్తం 58 అజెండాలపై చర్చించారు. అందులో పాలనాపరమైన, అవసరమైన అజెండాలపై కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలు భవిష్యత్తులో టీటీడీలో మెరుగైన సేవలు కల్పించేందుకు, అలాగే భక్తులకు ఎలాంటి సమస్యలు లేకుండా శ్రీవారి దర్శనం కలిగించేందుకు ఉపయోగపడనున్నాయి. దీంతో పాటు శ్రీవారి ఆలయం చుట్టూరా ఉన్న అడవుల్లో నెలకొన్న వివిధ పుణ్య క్షేతాల పరిరక్షణ, వాటిని సందర్శించేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం మెరుగైన నిర్ణయాలను తీసుకొని వాటిని అమలు చేయనున్నారు. టీటీడీ పాలక మండలి తాజాగా తీసుకున్న నిర్ణయాలపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. భక్తుల సౌకర్యార్థం టీటీడీ తీసుకున్న నిర్ణయాలు గొప్పవని అందరూ ప్రశంసిస్తున్నారు. మరి దీనిపై ఏపీ ప్రభుత్వం అనుమతులు అవసరమవుతాయో లేదో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad