తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూసే భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు అమలులో ఉన్న అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపు విధానంలో మార్పులు తీసుకొచ్చింది. భక్తులకు మరింత పారదర్శకంగా, సులభంగా టోకెన్లు అందించే ఉద్దేశంతో ‘ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ (FIFO)’ పద్ధతిని రద్దు చేసి, ఇకపై ‘లక్కీ డిప్’ విధానాన్ని ప్రవేశపెట్టింది.
ఈ కొత్త విధానం ప్రకారం, భక్తులు మూడు నెలల ముందుగానే అంగప్రదక్షిణ టోకెన్ల కోసం ఆన్‌లైన్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత లక్కీ డిప్ ద్వారా ఎంపికైన వారికి మాత్రమే టోకెన్లు కేటాయిస్తారు. ఉదాహరణకు, డిసెంబర్ నెలకు సంబంధించిన టోకెన్ల కోసం సెప్టెంబర్ 18 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
టోకెన్ల సంఖ్య, నిబంధనలు:
శుక్రవారాలు మినహా ప్రతిరోజు 750 టోకెన్లు జారీ చేస్తారు.
శనివారాల్లో మాత్రం 500 టోకెన్లు కేటాయిస్తారు.
ఒకసారి అంగప్రదక్షిణ సేవను పొందిన భక్తులు తిరిగి ఈ సేవ కోసం దరఖాస్తు చేసుకోవడానికి గతంలో ఉన్న 90 రోజుల గడువును 180 రోజులకు పెంచారు. ఈ మార్పు వల్ల ఎక్కువ మంది భక్తులకు ఈ సేవ చేసుకునే అవకాశం లభిస్తుంది.
భక్తులు ఈ మార్పులను గమనించి, తితిదే అధికారిక వెబ్‌సైట్ ద్వారా ముందుగా రిజిస్టర్ చేసుకొని అంగప్రదక్షిణ టోకెన్లను పొందవచ్చు. ఈ కొత్త విధానం పారదర్శకతను పెంచడంతో పాటు, టోకెన్ల కోసం భక్తులు అనవసరంగా ఎదురుచూడాల్సిన అవసరాన్ని తగ్గిస్తుందని తితిదే అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు


