తిరుమల తిరుపతిలో శ్రీవారి దర్శనం, గదుల కేటాయింపు, లడ్డూప్రసాదం, రీఫండ్ చెల్లింపుల అంశాల్లో ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీని అమలు చేస్తున్నారు. టీటీడీ సేవల్లో పారదర్శకత పెంచేందుకు ఈనిర్ణయం తీసుకున్నారు. తిరుమలలోని గదుల కేటాయింపు కేంద్రాల దగ్గర ప్రయోగాత్మకంగా కెమెరాలతో ఈసాంకేతికతను పరిశీలించారు. ఖాళీ చేసే సమయంలోనూ గదులు పొందిన వారే వచ్చి మళ్లీ ఫేస్ రికగ్నేషన్ చేయిస్తే కాషన్ డిపాజిట్ చెల్లిస్తారు. తిరుమలలో వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లో టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి వచ్చే భక్తులకు ఈసాంకేతికత సాయంతో లడ్డు ప్రసాదం అందజేయనున్నారు.
దళారీలకు చెక్ పెట్టేందుకే..
తిరుమలలో దళారీలకు చెక్ పెట్టేందుకు ప్రధానంగా ఈవిధానం ఎంతో ఉపయోగపడుతుందని టీటీడీ భావిస్తోంది. ఈనిర్ణయంతో పారదర్శకత కూడా మరింత పెరుగుతుందని ఈటెక్నాలజీని ప్రయోగాత్మంగా పరిశీలిస్తున్నారు. ఆతర్వాత పూర్తిస్థాయిలో అమలుపై నిర్ణయం తీసుకుంటారు. నేటి నుంచి అమలయ్యే ఈవిధానాన్ని గమనించాలని టీటీడీ కోరింది. ఇదిలా ఉంటే తిరుమలలో జారీ చేసే కరెంట్ బుకింగ్ శ్రీవాణి దర్శన దాతల టికెట్ల కోటాను పెంచింది. ప్రస్తుతం రోజూ వెయ్యి మందికి ఈటికెట్లను టీటీడీ జారీ చేస్తోంది. 750 ఆన్‌లైన్‌లో, 150 టికెట్లు తిరుమలలోని గోకులంలో, మరో వంద టికెట్లను తిరుపతి ఎయిర్‌పోర్ట్ కరెంట్ బుకింగ్ ద్వారా జారీ చేస్తున్నారు. నేటి నుంచి ఆన్‌లైన్ కోటాను 750 నుంచి 500కు కుదించి.. గోకులం కార్యాలయంలో 150 నుంచి 400కు టికెట్ల కోటాను పెంచింది.