తిరుమలలో వారానికి రెండు రోజులు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు టీటీడీ(TTD) అధికారులు స్వీకరిస్తారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంపై టీటీడీ ఈవో శ్యామలరావు తాజాగా స్పందించారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సుల లేఖలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఇక వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని అన్ని ఏర్పాటు పూర్తి చేశామని తెలిపారు. సామాన్య భక్తులకు పెద్ద పీఠ వేస్తున్నామని పేర్కొన్నారు. వైకుంఠ ద్వార దర్శనాల నిమిత్తం ఆన్‌లైన్‌లో లక్ష 40 వేల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు కేటాయించామని వెల్లడించారు.
కాగా తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకోకూడదని టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకోవడంపై తెలంగాణ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే తిరుమలలో తెలంగాణ భక్తులపై వివక్ష చూపుతున్నారంటూ మండిపడుతున్నారు. గతంలో లాగే తెలంగాణ భక్తులు, ప్రజాప్రతినిధులకు మెరుగైన సేవలు అందించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో వారానికి రెండు రోజులు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు స్వీకరిస్తారంటూ ప్రచారం జరిగింది.