తిరుమల శ్రీవారి భక్తులకు కీలక సమాచారం. వచ్చే ఏడాది మార్చి నెలకు సంబంధించిన అర్జిత సేవా టికెట్లను డిసెంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. లక్కీడిప్ కోటా కోసం డిసెంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అనంతరం డిసెంబర్ 21న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకార సేవా టికెట్లను విడుదల చేయనుంది. వర్చువల్ సేవా టికెట్స్ అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంటాయి.
ఇక డిసెంబర్ 23వ తేదీ ఉదయం 10గంటలకు అంగ ప్రదక్షిణం కోటా.. ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం కోటా.. మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన కోటా టోకెన్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. అలాగే డిసెంబర్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు మార్చి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటా విడుదల చేయనుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో వసతి గదుల బుకింగ్స్ ఓపెన్ అవుతాయి.