Bus Accident Kurnool Collector Announcement: కర్నూల్ జిల్లా చిన్న టేకూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైన ఘటనలో తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తుండగా.. బైక్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. దుర్ఘటనలో 19 మంది ప్రయాణికులు చనిపోగా.. ఇప్పటికే 18 మందిని గుర్తించారు. అయితే ఓ వ్యక్తి గురించి మాత్రం ఆచూకీ తెలియలేదు. దీంతో ఆ వ్యక్తి వివరాలు తెలిసిన వారు సంప్రదించాలంటూ జిల్లా కలెక్టర్ డా. ఎ. సిరి ప్రకటన జారీ చేశారు.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/kurnool-bus-accident-home-minister-anitha-press-meet/
చనిపోయిన వ్యక్తి హైదరాబాద్‌లోని ఆరాంఘర్ చౌరస్తాలోని బస్సు ఎక్కినట్లు తెలిసిందని కలెక్టర్ అన్నారు. వివరాలు తెలిస్తే కంట్రోల్ రూమ్ నెంబర్ 08518 277305కి సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. మృతుని పేరు బస్సు ప్రయాణికుల జాబితాలో లభ్యం కాలేదని.. వయసు 50 ఏళ్ళ వరకు ఉండొచ్చని తెలిపారు. మృతదేహం కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో ఉందని వెల్లడించారు.
కాగా, ఈ విషాద ఘటనకు కారణమైన బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను చెప్పిన వివరాలను విని పోలీసులు ఖంగు తిన్నారు. బస్సు ప్రమాదం జరిగిన స్థలానికి రాకముందే అక్కడ బైక్ యాక్సిడెంట్ జరిగిందని డ్రైవర్ పేర్కొన్నాడు. అతను ఇచ్చిన సమాచారంతో విచారించిన పోలీసులు.. బస్సు స్పాట్‌కి రాకముందే బైక్ ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/kurnool-bus-accident-biker-details/
రోడ్డుపై పడి ఉన్న బైకును ఢీ కొట్టడం వల్లే.. బస్సులో మంటలు చెలరేగినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. బైక్‌ను లాక్కెళ్లడం కారణంగానే ప్రమాదం జరిగిందని తేలింది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్, కో-డ్రైవర్లు పోలీసుల అదుపులో ఉన్నారు. అధికారులు కేసు దర్యాప్తు వేగవంతం చేశారు.


