Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయంలో భక్తులకు అందిస్తున్న సేవలను ఎంతగానో ప్రశంసించారు. ప్రత్యేకించి, శ్రీవారి సేవకులు చేస్తున్న కృషిని ఆమె అభినందించారు.
అంతకుముందు తిరుమల చేరుకున్న అనంతరం మంత్రి నిర్మలా సీతారామన్‌కు టీటీడీ బోర్డు సభ్యులు సుచిత్ర ఎల్లా, భాను ప్రకాష్ రెడ్డి, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆమె మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించి, శ్రీవారి సేవకులతో ముచ్చటించారు. సేవా కార్యక్రమాలను దగ్గరగా చూసి ముగ్ధులయ్యారు.
అనంతరం ఆమె ఇతర భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు. సామాన్య భక్తులతో కలిసి ప్రసాదం తీసుకోవడం తనకు అపురూపమైన అనుభూతిని ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని టీటీడీ ఫీడ్‌బ్యాక్ పుస్తకంలో తన అభిప్రాయాలను నమోదు చేశారు. శ్రీవారి సేవకులు భక్తులకు అందిస్తున్న సేవలు అమోఘమని, ఇది తన హృదయాన్ని హత్తుకుందని ఆమె లిఖితపూర్వకంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు రాజేంద్ర, భాస్కర్, వీజీవో సురేంద్ర, మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నిర్మలా సీతారామన్ పర్యటన, ఆమె చేసిన ప్రశంసలు టీటీడీ చేస్తున్న సేవలకు మరింత గుర్తింపునిచ్చాయి. భక్తులందరికీ మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ నిరంతరం కృషి చేస్తోందని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.


