కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) ప్రస్తుతం ఏపీ పర్యటనలో ఉన్నారు. శనివారం రాత్రి ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్న అమిత్ షాకు మంత్రులు లోకేశ్, అనితతోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు(CM Chandrababu) నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అమిత్ షాతో చంద్రబాబు, పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఏకాంతంగా భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ఆ తర్వాత చంద్రబాబు ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో పాల్గొన్నారు.
విందు సమయంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్(Jagan) ప్యాలెస్‌లపై అమిత్ షా ఆరా తీశారని తెలుస్తోంది. బెంగుళూరు, హైదరాబాద్, తాడేపల్లి, ఇడుపులపాయల్లో నాలుగు ప్యాలెస్‌లు ఉన్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అలాగే విశాఖలో ప్రభుత్వ సొమ్ము రూ.500కోట్లతో రుషికొండ ప్యాలెస్ నిర్మించుకున్నారని తెలిపారు. ఇక ఓటమి తరువాత జగన్ ప్రజల్లో తిరుగుతున్నారా అని అమిత్ షా అడగ్గా.. బెంగళూరులో ఉంటూ వారానికి రెండు సార్లు ఏపీకి వస్తున్నాడని సమాధానమిచ్చారు.
ఇక ఇవాళ ఉదయం ఏపీ బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించడంతో పాటు రాష్ట్ర అద్యక్ష పదవిపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు.