Ayyappa Pilgrims| అయ్యప్ప భక్తులకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu) శుభవార్త అందించారు. ఇకపై ఇరుముడితో విమానంలో ప్రయాణించేందుకు అనుమతినిస్తున్నట్లు తెలిపారు. జనవరి 20 వరకు అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. వచ్చే ఏడాది జనవరి 20 వరకు ఈ నిబంధన ఉంటుదని పేర్కొన్నారు. అయితే ఇరుముడిని చెకిన్ బ్యాగేజీలో కాకుండా తమ వెంట తీసుకెళ్లవచ్చంటూ వెల్లడించారు. కాగా ఇప్పటి వరకు భద్రతా కారణాల రీత్యా ఇరుముడిని వెంట తీసుకెళ్లనివ్వలేదు ఇమ్మిగ్రేషన్ అధికారులు.
విశాఖ-విజయవాడ మధ్య మరో రెండు కొత్త విమాన స్వరీసులు ఇవాళ్టి నుంచి అందుబాటులోకి వచ్చాయి. వైజాగ్ విమానాశ్రయంలో ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసును రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ కొత్త సర్వీసులతో విశాఖ- విజయవాడ మధ్య తిరిగే సర్వీసులు మూడుకు చేరింది. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ గొల్ల బాబురావు, ఎమ్మెల్యే గణబాబు హాజరయ్యారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సర్వీసు ఉదయం 9:35 గంటలకు విశాఖలో బయలుదేరి 10:35 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటోంది. తిరిగి రాత్రి 7:55కు విజయవాడలో బయలుదేరి 9 గంటలకు విశాఖ వెళ్తుంది. ఇండిగో సర్వీసు రాత్రి 7:15 గంటలకు విజయవాడలో బయలుదేరి 8:20కి విశాఖ చేరుతుంది. అదే సర్వీసు తిరిగి రాత్రి 8:45గంటలకు విశాఖలో బయలుదేరి 9:50 గంటలకు విజయవాడ చేరుతుంది.
ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ త్వరలోనే భోగాపురంలో ఏవియేషన్ యూనివర్సిటీని ప్రారంభిస్తామని స్పష్టంచేశారు. అలాగే నిర్ణీత గడువు కంటే ముందే భోగాపురం ఎయిర్‌పోర్టును పూర్తి చేసి ప్రారంభిస్తామన్నారు. అంతేకాకుండా త్వరలోనే ఇంటర్‌నేషనల్ కార్గో సెంటర్ అందుబాటులోకి రానుందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ఏపీని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉందని ఆయన వెల్లడించారు.