వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamshi) రిమాండ్‌ను విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు పొడిగించింది. కిడ్నాప్ కేసులో గతంలో విధించిన రిమాండ్ గడువు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో పోలీసులు జైలు నుంచే వంశీని వర్చువల్‌గా జడ్జి ఎదుట హాజరుపరిచారు. అనంతరం న్యాయమూర్తి రిమాండ్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
మరోవైపు ఇదే కేసులో వల్లభనేని వంశీని విచారణ కోసం పటమట పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ప్రస్తుతం వంశీని ఆరోగ్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షల అనంతరం విచారణ చేయనున్నారు. సత్యవర్ధన్ వాంగ్మూలం ఆధారంగా ఆయన్ను విచారించనున్నారు. కాగా మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే గన్నవరం పోలీసులు తాజాగా వంశీపై భూకబ్జా కేసు నమోదు చేశారు. గన్నవరం గాంధీబొమ్మ సెంటర్‌లో రూ. 10 కోట్ల విలువైన తన భూమిని కబ్జా చేశారని హైకోర్టు న్యాయవాది భార్య సుంకర సీతామహాలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుతో వంశీతో పాటు మరో 15 మందిపై కేసు నమోదైంది. తాజా పరిణామాలు చూస్తుంటే వంశీ ఇప్పుడలా జైలు నుంచి బయటకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు.