గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టులో ఊరట లభించింది. మల్లవల్లి భూముల పరిహారం విషయంలో తన అనుచరులకు అనుకూలంగా న్యాయం జరిగేలా చేశారనే ఆరోపణలపై హనుమాన్ జంక్షన్ పోలీసులు వంశీపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం వంశీ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు విచారణ జరిపి ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
అయితే ముందస్తు బెయిల్ వచ్చినప్పటికీ వంశీకి జైలు నుంచి బయటపడే అవకాశాలు ఇంకా కనిపించడం లేదు. ఆయనపై మరికొన్ని కేసులు కొనసాగుతుండటంతో, ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇక ఆత్కూరు భూకబ్జా కేసులో వంశీ బెయిల్ పిటిషన్‌పై విజయవాడ జిల్లా కోర్టు రేపు తుది తీర్పును వెలువరించనుంది. 8 ఎకరాల భూమి అక్రమంగా ఆక్రమించారనే ఆరోపణలపై పోలీసులు వంశీపై కేసు నమోదు చేశారు.
ఇక గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ1గా ఉన్న వంశీ అనుచరుడు రంగా రెండో రోజు కస్టడీ పూర్తయింది. సీఐడీ అధికారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు రంగాను విచారించారు. దాడి వెనుక ఉన్న అసలు కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, రంగా మాత్రం తనకు గుర్తులేదని, తెలియదని సమాధానాలు ఇచ్చినట్టు సమాచారం. రేపటితో రంగా కస్టడీ ముగియనుంది.