Dance master Pandu: తెలుగు బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ పండు (Pandu Master) ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో.. ఆయన రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.
పండు కారును ఢీకొన్న కోళ్లవ్యాన్: పోలీసుల కథనం ప్రకారం.. ఆనందపురం సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఓ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా.. పండు రోడ్డు పక్కకు కారును ఆపారు. అయితే అదే సమయంలో అత్యంత వేగంగా దూసుకొచ్చిన కోళ్ల వ్యాన్.. ఆగి ఉన్న వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న పండు మాస్టర్ తీవ్రంగా గాయపడగా.. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.
ఆసుపత్రికి తరలింపు: ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు తక్షణమే స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పండు మాస్టర్‌కు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అర్ధరాత్రి వేళ డ్రైవర్ నిద్రమత్తు, వాహనం అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద తీవ్రతను పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. పండు మాస్టర్ ప్రమాద వార్త తెలియడంతో బుల్లితెర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

