Homeఆంధ్రప్రదేశ్Project : వెలిగొండ ప్రాజెక్టుకు మహర్దశ.. ఆగస్టు నెలాఖరులోనే కృష్ణా జలాలు విడుదల

Project : వెలిగొండ ప్రాజెక్టుకు మహర్దశ.. ఆగస్టు నెలాఖరులోనే కృష్ణా జలాలు విడుదల

Veligonda project inauguration August 2026 : ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల పరిధిలోని బీడు భూములకు జీవజలాలు అందించే పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు కల నెరవేరే సుముహూర్తం ఆసన్నమైంది! దశాబ్దాలుగా నత్తనడకన సాగిన ఈ కలల ప్రాజెక్టును 2026 ఆగస్టు నెలాఖరు నాటికి ప్రారంభించి, నల్లమలసాగర్ జలాశయానికి కృష్ణా జలాలను తరలించేందుకు ప్రభుత్వం రంగాన్ని సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి పనులు వేగవంతం చేసినట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. 

- Advertisement -

యుద్ధప్రాతిపదికన పనులు – రూ. 3,000 కోట్లతో వ్యూహం : 2024లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వెలిగొండను ప్రాధాన్యతా ప్రాజెక్టుగా చేపట్టింది. గత రెండేళ్లలో రూ.3,000 కోట్లు వెచ్చించి పెండింగ్ పనులను 90% నుంచి 99% వరకు పూర్తి చేశారు. కొల్లంవాగు అప్రోచ్ ఛానల్, హెడ్ రెగ్యులేటర్ గేట్ల పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. సొరంగాల్లోని 286 మీటర్ల సీసీ లైనింగ్ పనులను 5 గాంట్రీల సహాయంతో ఆగస్టు 18 నాటికి పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

టీబీఎం తరలింపు.. ఐదు నెలల్లోనే ఫీడర్ కెనాల్ : వెలిగొండ సొరంగంలో ఉన్న 1,900 మెట్రిక్ టన్నుల బరువు, 175 మీటర్ల పొడవున్న టీబీఎం (TBM) యంత్రం తొలగింపు ప్రక్రియ 70% పూర్తయింది. మిగిలిన 30% పనిని మరో 10 రోజుల్లో పూర్తి చేయనున్నారు. ముఖ్యమంత్రి మంజూరు చేసిన రూ. 460 కోట్లతో ఫీడర్ కెనాల్ పనులను కేవలం 5 నెలల్లోనే పూర్తి చేయడం విశేషం. తూర్పు ప్రధాన కాలువ, గొట్టిపడియ, సుంకేసుల రెగ్యులేటర్ పనులకు ఆగస్టు 15 డెడ్‌లైన్‌గా నిర్ణయించారు.

నిర్వాసితులకు రూ. 600 కోట్ల పరిహారం : ప్రాజెక్టు పరిధిలోని 4,761 నిర్వాసిత కుటుంబాలకు రూ. 600 కోట్ల ఆర్‌అండ్‌ఆర్ (R&R) పరిహారాన్ని ఈ నెలాఖరులోగా రెండు విడతల్లో చెల్లించనున్నారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్‌సీ నరసింహమూర్తిల సమక్షంలో జరిగిన సమీక్షలో స్పష్టమైన ప్రణాళికను ఖరారు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News