డెంగీ, మలేరియా లాంటి విషజ్వరాలు గతంలో బాగా ప్రబలిన ప్రాంతాలను హాట్ స్పాట్లుగా గుర్తించి, వెంటనే తగిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ప్రజల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత మనదేనని పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులపై వైద్య ఆరోగ్యశాఖ సన్నద్ధతకు సంబంధించి శుక్రవారం మంత్రి విడదల రజిని రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులందరితో కలిపి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ వర్షాలు మొదలైన నేపథ్యంలో విష జ్వరాలు ప్రబలే అవకాశాలు ఉంటాయని తెలిపారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్యం అందించడం లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, ప్రభుత్వ ఆశయాలు, లక్ష్యాలు సాధించేలా అధికారులు పనిచేయాల్సి ఉందని పేర్కొన్నారు. వెంటనే ఇంటింటికీ పీవర్ సర్వే ప్రారంభించాలని చెప్పారు. వాలంటీర్లు, ఏఎన్ ఎంలు ఈ సర్వేలో పాల్గొనేలా క్షేత్రస్థాయిలో ఆదేశాలు వెళ్లాలని, సంబంధిత ఏర్పాట్లన్నీ చేసుకోవాలని ఆదేశించారు. ఈ నెల పదో తేదీ నుంచి ఫీవర్ సర్వే ప్రారంభం కావాలన్నారు. పారిశుద్ధ్యం విషయంలో పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలతో సమన్వయం చేసుకుంటూ వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ముందుకెళ్లాలని చెప్పారు.
కిట్ల కొరత ఉండకూడదు
డెంగీ, మలేరియా టెస్టులకు సంబంధించి వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ స్థాయిలోనే కిట్లు అందుబాటులో ఉండాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా కిట్ల కొరత రావడానికి వీల్లేదని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సాధారణంగా సీజనల్ వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ఆయా ప్రాంతాల్లో వెనువెంటనే చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. మన్యం, అల్లూరి సీతారామరాజు లాంటి జిల్లాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఫాగింగ్, దోమతెరల పంపిణీ, గంబూషియా చేపల పంపిణీ లాంటి చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. వైద్యులు ఆస్పత్రుల్లో తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఎక్కడా మందుల కొరత రావడానికి వీల్లేదని చెప్పారు. బ్లడ్ బ్యాంకులపై ప్రత్యేక నిఘా ఉంచాలని చెప్పారు. ఎక్కడా రక్తం కొరత లేకుండా చూడాలని తెలిపారు. డెంగీ బాధితులకు రక్తం సులువుగా అందే పరిస్థితులు ఉండాలని చెప్పారు.
క్షేత్రస్థాయి పరిశీలనలు తప్పనిసరి
సీజనల్ వ్యాధుల ప్రభావం ఉండే ఈ మూడునెలలూ అధికారులు కచ్చితంగా క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేస్తూ ఉండాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు కచ్చితంగా గ్రామాలు, పట్టణాల్లోకి వెళ్లి పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, లార్వాల నిల్వలు లేకుండా జాగ్రత్తపడటం, జగనన్న కొత్తగా సృష్టించిన వైద్య సదుపాయాలను వినియోగించుకునేలా చూడటం లాంటి విషయాలపై ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15 రోజులపాటు ఇంటింటికీ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. వాలంటీర్లు, ఏఎన్ ఎంల సహకారం తీసుకుని వెంటనే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాలన్నారు. సంబంధిత వివరాలతో కరపత్రాలు రూపొందించి ఇంటింటికీ అందజేయాలని చెప్పారు.
సురక్షిత మంచినీరు అందాలి
ప్రజలకు అందుతున్న నీరు సురక్షితంగా ఉండేలా వైద్య ఆరోగ్యశాఖ కూడా పర్యవేక్షిస్తే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. పంచాయతీల కార్యదర్శులతో వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్, పీహెచ్‌సీల సిబ్బంది కలిసి పనిచేయాలని, ప్రజలకు అందుతున్న నీటి నాణ్యతను వైద్య సిబ్బంది కూడా పర్యవేక్షించాలని సూచించారు. ప్రజల ఆరోగ్యం విషయంలో అందరూ బాధ్యతగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణభాబు, కార్యదర్శి మంజుల డి హోస్మని, కమిషనర్ జె.నివాస్, ఏపీవీవీపీ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, డైరెక్టర్ ఫర్ హెల్త్ రామిరెడ్డి, డైరెక్టర్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ నరసింహం తదితరులు పాల్గొన్నారు.