ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి, మే 3వ తేదీన శంకుస్థాపన చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి నిర్ణయించారని, రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మౌలిక వసతుల శాఖామంత్రి గుడివాడ అమర్‌నాథ్ వెల్లడించారు. ఈ విమానాశ్రయ నిర్మాణం ద్వారా, ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతుందని పేర్కొన్నారు.
భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి సేకరించిన భూములను మంత్రి అమర్‌నాథ్ సందర్శించారు. ట్రంపెట్ రహదారి నిర్మాణం జరిగే ప్రదేశాన్ని, ముఖ్యమంత్రి నిర్వహించే భారీ బహిరంగ సభ ప్రదేశాలను ఆయన పరిశీలించారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంఎల్ఏ బడ్డుకొండ అప్పలనాయుడు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలెవన్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో, అంతకుముందు సన్‌రే రీసార్ట్‌లో సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటివరకు జరిగిన భూ సేకరణ ప్రక్రియను తెలుసుకున్నారు. శంకుస్థాపన, ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లపై అధికారులు, నాయకులతో చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి అమర్‌నాథ్ మీడియాతో, భోగాపురం విమానాశ్రయ నిర్మాణాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా భావిస్తోందని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రజల సుదీర్ఘ స్వప్నం నెరవేరే రోజు ఆసన్నమయ్యిందని అన్నారు. శంకుస్థాపన జరిపేందుకు అవసరమైన అన్ని రకాల లాంఛనాలను పూర్తి చేశామని చెప్పారు. సుమారు 2,200 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమయ్యే ఈ ఎయిర్‌పోర్టుకు, ఇప్పటికే దాదాపు 2,195 ఎకరాల భూసేకరణ పూర్తి అయ్యిందని, మిగిలిన కొద్దిపాటి భూ సేకరణ కూడా త్వరలో పూర్తి కానుందని తెలిపారు. ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పారు. శంకుస్థాపన అనంతరం 24 నుంచి 30 నెలల్లో విమానాశ్రయ నిర్మాణం పూర్తి అవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా భారీ భహిరంగ సభను నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు.
ఈ పర్యటనలో జెడ్‌పి ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, నెల్లిమర్ల ఎంఎల్ఏ బడ్డుకొండ అప్పలనాయుడు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలెవన్, మారిటైమ్ బోర్డు ఛైర్మన్ కెవి రెడ్డి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, ఆర్‌డిఓ ఎంవి సూర్యకళ, తాశిల్దార్ కె.శ్రీనివాసరావు, ఎయిర్‌పోర్ట్ భూసేకరణ సమన్వయాధికారి అప్పలనాయుడు, జిఎంఆర్ సిఈఓ మన్మయ్, ప్రాజెక్టు మేనేజర్ రామరాజు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.