Vijayasai Reddy getting closer And Plans to Join in BJP: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒకటిన్నరేళ్లు పూర్తవుతున్న వేళ పొలిటికల్ ఈక్వేషన్లు రోజురోజుకు మారిపోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీని వీడిన ఆ పార్టీ కీలక నేత, నంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి ఏకంగా తన రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తాను వైసీపీని వీడడం లేదని, పాలిటిక్స్ నుంచే వెళ్లిపోతున్నానని గుడ్‌బై చెప్పారు. అయితే, తాజాగా విజయసాయి రెడ్డి తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే తాను రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తానని తాజాగా ఇచ్చిన స్టేట్‌మెంట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదే స్పీడులో ఆదివారం ఆయన మరో అడుగు ముందుకేసి ఓ ట్వీట్ చేశారు. హిందువులపై కుట్రను సహించేంది లేదని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. మతమార్పిడులను ఆపాలని, అదే భారతదేశానికి శ్రీరామరక్ష అని వ్యాఖ్యానించారు. విజయసాయి రెడ్డి తాజాగా చేసిన ట్వీట్ పొలిటికల్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. డబ్బు ఆశ చూపి.. మతం మార్చాలని ప్రయత్నించే వారికి తగిన రీతిలో గుణపాఠం చెబుదామని పిలుపునిచ్చారు. గత రెండు దశాబ్దాలుగా జరిగిన మత మార్పిడులపై కమిటీ వేసి విచారణ జరపాలని కూటమి ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. దేశం కోసం ధర్మం కోసం హిందువుల్లో ఉన్న అన్ని సామాజిక వర్గాలు ఒక్కటవ్వాలని విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. అయితే, వైసీపీని కార్నర్ చేసేందుకే ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
Also Read: https://teluguprabha.net/telangana-news/jr-ntr-approached-the-delhi-high-court/
హిందూ మతంపై ఆసక్తికర వ్యాఖ్యలు..
కాగా, విజయసాయిరెడ్డి తాజాగా హిందూ మతంపై కుట్రలు చేస్తే సహించేది లేదంటూ ఆయన వ్యాఖ్యానించడం చర్చకు దారి తీసింది. వైసీపీని వీడిన అనంతరం బీజేపీకి సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీలో చేరే ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారన్న విశ్లేషణ వినిపిస్తోంది. సాయిరెడ్డి భవిష్యత్ అడుగులపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. వైసీపీలో కీలకంగా పని చేసిన విజయ సాయిరెడ్డి 2024 ఎన్నికల తరువాత ఆ పార్టీని వీడారు. జగన్ కోటరీ కారణంగానే తాను పార్టీ వీడుతున్నట్లు స్పష్టం చేసారు. ఆ తరువాత కాకినాడ పోర్టు, లిక్కర్ కేసుల్లో సాయిరెడ్డి సంచలన విషయాలు మీడియాకు వెల్లడించారు. అనంతరం, వైసీపీతో తెగదెంపులు తెంచుకున్నారు. అయితే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నానని చెబుతోనే, తాజాగా రీఎంట్రీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. విజయసాయిరెడ్డి తొలి నుంచి ఎంపీగా ఉండడంతో ఆయనకు జాతీయస్థాయిలో ఉన్న బీజేపీ నేతలతో మంచి సంబంధాలున్నాయని, ఈ సంబంధాలతో త్వరలో ఆయన కాషాయకండువా కప్పుకునే ఛాన్స్ ఉందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. అయితే, బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన పార్టీలో చేరతారా? లేక బీజేపీలోనే జాయిన్ అవుతారా? అనేది ఆసక్తికరంగా మారింది. పవన్ నాకు స్నేహితుడని విజయసాయిరెడ్డి పదేపదే చెబుతుండడం, దీనికి తోడు హిందూమతంపై సాయిరెడ్డి కూడా పవన్ తరహాలో ఘాటుగా స్పందించడం కూడా ఆయన బీజేపీలో లేదా జనసేనలో చేరతారనే ప్రచారానికి కారణమవుతోందని పలువురు పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు.

