AP Liquor Scam: ఏపీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో భాగంగా వైసీపీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డిని గురువారం ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో ఈ విచారణ ప్రక్రియ సుమారు ఏడున్నర గంటల పాటు కొనసాగింది. విచారణ ముగిసిన అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ మద్యం కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.
Also Read: https://teluguprabha.net/telangana/ntr-statue-in-maitreevanam-circle/
2019 నుంచి 2024 మధ్యలో ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేసిన మద్యం విధానం, అందులో జరిగిన మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ కుంభకోణం విలువ దాదాపు రూ. 3,500 కోట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొత్త మద్యం విధానం ద్వారా సరఫరాదారుల నుంచి భారీగా లంచాలు వసూలు చేశారని, ఆటోమేటిక్ కొనుగోలు వ్యవస్థను తీసివేసి మాన్యువల్ అనుమతులకు మార్చడం ద్వారా అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖుల ఇళ్లపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. పలు డిజిటల్ రికార్డులను, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

