Vijayasai Reddy Slams Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు కీలక నేతగా, రెండో నంబర్‌గా వెలుగొందిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణకు హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై , ఆయన చుట్టూ ఉన్న ‘కోటరీ’పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
జగన్ ‘కోటరీ’పై ధ్వజం:
విజయసాయిరెడ్డి తన ఆవేదనను వెళ్లగక్కుతూ.. పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో తనకు లభించిన ప్రాధాన్యతను పనికిమాలిన కోటరీ దెబ్బతీసిందని ఆరోపించారు. “జగన్ వద్ద నేను పాలేరులా పనిచేశాను, కానీ ఆయన ఆ కోటరీ మాటలే నమ్మారు. 2020 నుంచే నన్ను పద్ధతి ప్రకారం సైడ్ లైన్ చేశారు. నాపై దుష్ప్రచారం చేసి పొగబెట్టి బయటకు పంపారు” అని ఆయన పేర్కొన్నారు.
Also Read:Nara Lokesh – నిఖిల్ కామత్‌తో నారా లోకేశ్ కీలక భేటీ!
ఆస్తుల ఆరోపణలపై వివరణ:
విశాఖపట్నంలో తాను వందల కోట్లు సంపాదించానన్న ఆరోపణలను ఆయన ఖండించారు. విశాఖలో ఒక అపార్ట్‌మెంట్ తప్ప తనకు మరే ఆస్తులు లేవని, ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. తన కుమార్తెకు ఉన్న ఆస్తులను తనకు ఆపాదించడం సరికాదని స్పష్టం చేశారు.
ఈడీ విచారణ – నంబర్ 2 వివాదం:
మద్యం స్కామ్ గురించి ఈడీ ప్రశ్నించగా, తనకు ఏమీ తెలియదని, ఆ వ్యవహారాల్లో ఉన్నవారినే అడగాలని చెప్పినట్లు వెల్లడించారు. “ప్రాంతీయ పార్టీల్లో నంబర్-2 అనేది ఉండదు. కేసుల విషయంలో నేను నంబర్-2 కావొచ్చు కానీ, లాభాల విషయంలో నా స్థానం వంద తర్వాతే” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
భవిష్యత్ కార్యాచరణ:
గత ఏడాది కాలంగా తాను రాజకీయాలకు దూరంగా ఉండి వ్యవసాయం చేసుకుంటున్నానని, వచ్చే జూన్ తర్వాతే తన రాజకీయ పునఃప్రవేశం , భవిష్యత్ వ్యూహాలపై స్పందిస్తానని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. జగన్ తనపై చేసిన విమర్శలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి.

