Vijayawada Bypass construction status : విజయవాడ నగరంలో ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ఛేదించే రోజులు దగ్గరపడ్డాయి. నగరంలోకి వెళ్లాల్సిన అవసరం లేకుండానే గమ్యస్థానాలకు చేరుకునేలా రూపుదిద్దుకుంటున్న ‘విజయవాడ వెస్ట్ బైపాస్’ ఇప్పుడు పరుగులు పెట్టేందుకు సిద్ధమైంది. అద్దంలా మెరిసే ఆరు వరుసల రహదారిపై సంక్రాంతి నుంచే పాక్షికంగా వాహనాల సందడి మొదలవ్వగా, ఇప్పుడు గొల్లపూడి వైపు నుంచి వచ్చే వాహనదారులకు భారీ ఊరట లభించనుంది.
రూ. 1,148 కోట్లతో మెగా ప్రాజెక్టు : నేషనల్ హైవే-16లో భాగంగా చినఆవుటపల్లి-గొల్లపూడి మధ్య 30 కిలోమీటర్ల మేర ఈ 6 లైన్ల విజయవాడ బైపాస్ రోడ్డు నిర్మాణం జరుగుతోంది. దీని కోసం కేంద్ర రహదారి, రవాణా శాఖ రూ.1,148.40 కోట్లను వెచ్చిస్తోంది. తాజాగా లోక్‌సభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు 29.57 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. కేవలం 0.43 కిలోమీటర్ల పనులు మాత్రమే పెండింగ్‌లో ఉండగా, వాటిని మార్చి 31 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
నేటి సాయంత్రం నుంచే అనుమతి : గొల్లపూడి వైపు నుంచి వచ్చే వాహనదారులకు ఎన్.హెచ్ అధికారులు తీపి కబురు అందించారు. ఫిబ్రవరి 10 సాయంత్రం నుంచి గొల్లపూడి వైపు నుంచి వచ్చే కార్లు, ద్విచక్ర వాహనాలను హాయ్‌ల్యాండ్ రోడ్డు వరకు అనుమతించనున్నారు. గొల్లపూడి నుంచి వచ్చే వాహనాలు కృష్ణా నది, సీడ్ యాక్సెస్ రోడ్డును దాటిన తర్వాత బైపాస్ నుంచి కిందకు దిగి మందడం మీదుగా సెక్రటేరియట్, హైకోర్టు వైపు వెళ్లవచ్చు. హాయ్‌ల్యాండ్ రోడ్డులోకి దిగి 200 మీటర్లు ప్రయాణించిన తర్వాత నేరుగా చెన్నై-కోల్‌కతా సర్వీసు రోడ్డులోకి చేరుకోవచ్చు.
లారీలకు ఫిబ్రవరి 20 నుంచి గ్రీన్ సిగ్నల్ : భారీ వాహనాలైన లారీలకు ఈనెల 20 నుంచి అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. గొల్లపూడి నుంచి వచ్చే లారీలు నేరుగా చెన్నై-కోల్‌కతా హైవేలోకి దిగి, విజయవాడ వైపు కొంత దూరం వెళ్లి ఎన్ఆర్ఐ ఆస్పత్రి కూడలి వద్ద ఉన్న అండర్ పాస్ నుంచి యూటర్న్ తీసుకొని గుంటూరు వైపు వెళ్లవచ్చు. వచ్చే నెలలో కోల్‌కతా-చెన్నై రహదారితో ఈ బైపాస్‌ను పూర్తిగా అనుసంధానించనున్నారు. ఆ తర్వాత వాహనాలు ఎక్కడా ఆగకుండా నేరుగా హైవేలోకి ప్రవేశించవచ్చు.
తగ్గనున్న దూరభారం – పెరగనున్న వేగం : ఈ బైపాస్ అందుబాటులోకి రావడం వల్ల గుంటూరు నుంచి ఏలూరు వైపు వెళ్లే వారికి సుమారు 15 నుంచి 20 కిలోమీటర్ల దూరం తగ్గడంతో పాటు, విజయవాడ నగరంలోని ట్రాఫిక్ చిక్కుల నుంచి విముక్తి కలుగుతుంది. “చెప్పిన మాట ప్రకారం మార్చి నెలాఖరుకల్లా ప్రాజెక్టును పూర్తి చేస్తాం” అని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. హాయ్‌ల్యాండ్ వద్ద టోల్ ప్లాజా దాటిన తర్వాత సర్వీసు రోడ్ల అనుసంధానం పూర్తయితే, ఏపీ రాజధాని ప్రాంతానికి కనెక్టివిటీ మరింత సులభతరం కానుంది.

