Vijayawada caretaker crime alert : ఉరుకుల పరుగుల జీవితంలో వృద్ధులైన తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవడం, ఇంటి పనుల్లో సహాయం కోసం కేర్‌టేకర్‌లను నియమించుకోవడం సర్వసాధారణమైపోయింది. అయితే, ఆపదలో ఆదుకుంటారనుకున్నవారే.. అండగా ఉంటారనుకున్నవారే అపాయంగా మారుతున్నారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన వారే కాలనాగులై కాటేస్తున్నారు. విజయవాడ నగరంలో ఇటీవల వెలుగుచూసిన రెండు దారుణ ఘటనలు ఈ కఠోర వాస్తవాన్ని కళ్ళకు కడుతున్నాయి. అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేస్తూ, నమ్మిన వారి గొంతు కోస్తున్న ఈ కేర్‌టేకర్‌ల నేర ప్రవృత్తి నగరవాసులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. అసలు ఈ ఘోరాలకు దారితీసిన పరిస్థితులేంటి…? పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసిన సంచలన నిజాలేమిటి..?
విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల నమోదైన రెండు కేసులు, కేర్‌టేకర్‌లను నియమించుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మరోసారి గుర్తుచేస్తున్నాయి. ఎలాంటి పూర్వాపరాలు తెలుసుకోకుండా, కేవలం అవసరం కోసం అపరిచితులను ఇంట్లో పెట్టుకోవడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటనలు స్పష్టం చేస్తున్నాయి.
డబ్బు కోసం యజమాని ప్రాణాలనే తీసిన అనూష : కొద్ది రోజుల క్రితం నగరంలో నివసిస్తున్న రిటైర్డ్ ఇంజనీర్ రామారావు దారుణ హత్యకు గురయ్యారు. వృద్ధురాలైన తన తల్లి సరస్వతి బాగోగులు చూసుకునేందుకు ఆయన అనూష అనే యువతిని కేర్‌టేకర్‌గా నియమించుకున్నారు. ఆమెపై నమ్మకంతో ఇంటి బాధ్యతలను అప్పగించారు. అయితే, అనూష కన్ను రామారావు ఇంట్లోని డబ్బు, ఆస్తులపై పడింది. తన ప్రియుడితో కలిసి పక్కా ప్రణాళికతో, నమ్మకంగా ఆశ్రయం ఇచ్చిన రామారావును అత్యంత కిరాతకంగా హత్య చేసింది. డబ్బు కోసం జరిగిన ఈ దారుణం నగరంలో సంచలనం సృష్టించింది. అనూష నేర చరిత్ర గురించి ముందే తెలుసుకుని ఉంటే, ఒక నిండు ప్రాణం బలై ఉండేది కాదని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నమ్మకంగా నటిస్తూ నగలు దోచేసిన తేజశ్రీ : పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మరో ఘటనలో, అడుసుమిల్లి శివలీల అనే గృహిణి ఇంట్లో తేజశ్రీ అనే యువతిని కేర్‌టేకర్‌గా నియమించుకున్నారు. కొద్ది కాలంలోనే అందరితో కలుపుగోలుగా ఉంటూ, నమ్మకాన్ని చూరగొంది. ఇదే అదనుగా భావించిన తేజశ్రీ, ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి విలువైన వజ్రాల గాజులు, బంగారు ఆభరణాలను చాకచక్యంగా అపహరించింది. ఏమీ తెలియనట్టు నాటకమాడి, పని మానేసి వెళ్ళిపోయింది. ఇంట్లో వారందరూ ఉన్నప్పటికీ నగలు మాయం కావడంతో అనుమానం వచ్చిన శివలీల దంపతులు పోలీసులను ఆశ్రయించారు. తమదైన శైలిలో విచారణ చేపట్టిన పోలీసులు, కేర్‌టేకర్ తేజశ్రీయే దొంగ అని నిర్ధారించి, ఆమెను అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు.
పోలీసుల హెచ్చరిక: కళ్ళు తెరవండి : ఈ రెండు ఘటనల నేపథ్యంలో విజయవాడ పోలీసులు నగరవాసులకు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇంట్లో పనులకు, వృద్ధుల సంరక్షణకు కొత్త వ్యక్తులను నియమించుకునేటప్పుడు అత్యంత జాగరూకతతో ఉండాలని సూచిస్తున్నారు.
పూర్వాపరాల పరిశీలన: నియమించుకునే వ్యక్తి యొక్క పూర్తి చిరునామా, గుర్తింపు కార్డులు (ఆధార్, ఓటర్ ఐడి) తీసుకోవాలి. వారి గత చరిత్ర, ఇంతకుముందు ఎక్కడ పనిచేశారనే వివరాలు క్షుణ్ణంగా విచారించాలి.
పోలీస్ వెరిఫికేషన్: సమీప పోలీస్ స్టేషన్‌లో వారి వివరాలు అందించి, నేర చరిత్ర ఏమైనా ఉందేమో సరిచూసుకోవడం ఉత్తమం.
ఏజెన్సీల ద్వారా నియామకం: గుర్తింపు పొందిన, నమ్మకమైన ఏజెన్సీల ద్వారా మాత్రమే కేర్‌టేకర్‌లను నియమించుకోవడం శ్రేయస్కరం. తెలియని వ్యక్తులను గుడ్డిగా నమ్మి ఇంట్లో పెట్టుకుంటే, మన చేతులతో మనమే సమస్యలను కొనితెచ్చుకున్నట్లు అవుతుందని, ఈ రెండు ఘటనలను ఒక గుణపాఠంగా తీసుకోవాలని పోలీసులు నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.


