Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Vijayawada: ఎపిఎండిసి కార్యాలయంలో అధికారులతో ఎస్సీ కమిషన్ భేటీ

Vijayawada: ఎపిఎండిసి కార్యాలయంలో అధికారులతో ఎస్సీ కమిషన్ భేటీ

రూల్ ఆఫ్ రిజర్వేషన్ పై ఎస్సీ కమిషన్ సమీక్ష

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎపిఎండిసి)ని జాతీయ ఎస్సీ కమిషన్ సందర్శించింది. కమిషన్ సభ్యురాలు, మాజీ పార్లమెంట్ మెంబర్ డాక్టర్ అంజు బాలా, కమిషన్ డైరెక్టర్ డాక్టర్ జి.సునీల్ కుమార్ బాబులు ఎపిఎండిసి అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎపిఎండిసిలో అమలు చేస్తున్న రూల్ ఆఫ్ రిజర్వేషన్ విధానంను సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి ఎస్సీ కమిషన్ కు వివరించారు. సంస్థలో రాజ్యాంగబద్దంగా అమలు చేస్తున్న రిజర్వేషన్ విధానంను వర్తింప చేస్తున్నామని, దానికి అనుగుణంగానే నియామకాల ప్రక్రియను కొనసాగిస్తున్నామని వివరించారు. అదే విధంగా ప్రభుత్వరంగ సంస్థగా ఎపిఎండిసి సాధించిన ప్రగతిని కూడా వెల్లడించారు. ప్రతిఏటా రెట్టింపు రెవెన్యూ ద్వారా ఎపిఎండిసి ప్రగతిపథంలో పయనిస్తోందని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, సీఎం వైయస్ జగన్ మైనింగ్ రంగంలో తీసుకువచ్చిన సంస్కరణల కారణంగా ఎపిఎండిసి తన కార్యకలాపాలను జాతీయ స్థాయికి విస్తరించిందని తెలిపారు. కేవలం లాభాలను ఆర్జించడమే కాకుండా, సామాజిక బాధ్యతగా మైనింగ్ ప్రాంతాల్లో వేలాది మందికి కార్పోరేట్ తరహాలో ఉచిత విద్య, వైద్యం, 160 హ్యాబిటేషన్ లలో రెండు లక్షల మందికి సురక్షిత మంచినీటిని అందిస్తోందని వివరించారు. సిఎస్ఆర్ కింద ఎస్సీ సామాజికవర్గం అధికంగా ఉన్న గ్రామాల్లో ప్రత్యేకంగా ఆర్వో వాటర్ ప్లాంట్ లను ఏర్పాటు చేశామని తెలిపారు. అంతేకాకుండా ప్రతిఏటా ఎపిఎండిసి పబ్లిక్ స్కూల్ ద్వారా ఎస్సీ విద్యార్ధులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నామని తెలిపారు.

- Advertisement -

అన్ని సంస్థలకు ఎపిఎండిసి ఆదర్శప్రాయం: డాక్టర్ అంజు బాలా

ఎపిఎండిసిలో అనుసరిస్తున్న విధానాలు, సామాజిక బాధ్యతగా నిర్వహిస్తున్న కార్యక్రమాల పట్ల జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యురాలు డాక్టర్ అంజు బాలా సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగ సంస్థగా ఎపిఎండిసి మిగిలిన సంస్థలకు ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. ఇప్పటి వరకు సంస్థలో ఎటువంటి కులవివక్షత ఫిర్యాదులు లేకపోవడం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ విషయంలో ఖచ్చితమైన విధానంను రూపొందించుకుని అమలు చేయడం పట్ల సంస్థ విసి & ఎండిని అభినందించారు. ఎపిఎండిసికి జాతీయ స్థాయిలో ప్రశంసాపత్రం పంపడంతోపాటు, కమిషన్‌ తరఫున రాష్ట్రపతికి కూడా సిఫార్సు చేస్తామని తెలిపారు. వివక్షత లేని సమాజం కోసమే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పనిచేస్తున్నాయని, ప్రగతి నినాదంతో అందరూ పనిచేసినప్పుడే మంచి సమాజం రూపుదిద్దుకుంటుదని అన్నారు. సామాజిక కార్యక్రమాల్లో భాగంగా విద్యా, వైద్యం, సురక్షిత మంచినీటికి ఎపిఎండిసి అధిక ప్రాధాన్యత ఇవ్వడం పట్ల అభినందించారు. ప్రతిఏటా ఒక ఎస్సీ సామాజికవర్గం ఎక్కువగా ఉన్న గ్రామాన్ని దత్తత తీసుకుని, దానిలో అన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి, దానిని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దాలని విజ్ఞప్తి చేశారు.

అనంతరం సంస్థ ప్రాంగణంలో ఎస్సీ కమిషన్ సభ్యురాలు డాక్టర్ అంజుబాలా, కమిషన్ డైరెక్టర్ డాక్టర్ సునీల్ కుమార్ బాబు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారికి సంస్థ విసి &ఎండి విజి వెంకటరెడ్డి జ్ఞాపికలను అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎపిఎండిసి సలహాదారు డిఎల్ఆర్ ప్రసాద్, కె.నాగేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్లు బిపిన్ కుమార్, రామ్ నారాయణన్, జనరల్ మేనేజర్లు టి.నతానేయల్, ఆళ్ళ నాగేశ్వరరెడ్డి, గనులశాఖ జెడి శ్రీనివాసరావు, డిడి రవిచంద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News