Scrubber packaging scam Vijayawada : ఇంట్లోనే ఉంటూ సులభంగా డబ్బులు సంపాదించవచ్చన్న ఆశే ఆ అమాయకుల పాలిట శాపమైంది! గిన్నెలు శుభ్రం చేసే స్క్రబ్బర్లను ప్యాకింగ్ చేస్తే చాలు.. నెలకు వేలాది రూపాయల ఆదాయం వస్తుందని ఆశచూపిన ఒక సంస్థ రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసింది. విజయవాడ కేంద్రంగా వెలుగుచూసిన ఈ భారీ మోసంలో ఉమ్మడి కృష్ణా జిల్లావ్యాప్తంగా పేద, మధ్యతరగతి ప్రజల నుంచి ఏకంగా రూ.10 కోట్ల మేర వసూలు చేసి నిర్వాహకులు చెక్కేశారు.
సోషల్ మీడియా ఆకర్షణ – ఆశ చూపి నిలువుదోపిడీ : కృష్ణా జిల్లా కనూరుకు చెందిన పసుపులేటి అంకుశం, ఇతర భాగస్వాములు కలిసి విజయవాడ సత్యనారాయణపురంలోని ఆదిశేషయ్య వీధిలో ‘మాషా-అల్లా ఎంటర్‌ప్రైజెస్’ పేరుతో కార్యాలయం ప్రారంభించారు. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ స్క్రబ్బర్ ప్యాకింగ్ ద్వారా అధిక లాభాలొస్తాయని నమ్మించారు. ఇతరులను చేర్పిస్తే విదేశీ పర్యటనలు, అదనపు కమిషన్ ఇస్తామని ఎర వేశారు. దీంతో సత్యనారాయణపురం, బావాజీపేట, బెంచ్ సర్కిల్, గన్నవరం, గుడివాడ తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది ఇందులో పెట్టుబడులు పెట్టారు.
డిపాజిట్ల దందా – మూతపడిన ముసుగు : ఈ పథకం ప్రకారం ప్రతి సభ్యుడు రూ.30,000 వెచ్చించి యంత్రం కొనుగోలు చేయడంతో పాటు రూ.1 లక్ష డిపాజిట్ చేయాలి. సంస్థ అందించే స్క్రబ్బర్లు, ‘MXO’ కవర్లతో ప్యాకింగ్ చేసి ఇస్తే రూ.24,000 పారితోషికం ఇస్తామని నమ్మించారు. ప్రారంభంలో కొందరికి క్రమం తప్పకుండా చెల్లింపులు చేసి నమ్మకం కుదిర్చారు. అయితే ఉత్పత్తి పెరిగిపోయి, సరుకు మార్కెట్‌లో అమ్ముడుపోకపోవడంతో గిడ్డంగులు నిండిపోయాయి. చెల్లింపులు చేయలేక నిర్వాహకులు బోర్డు తిప్పేసి అజ్ఞాతంలోకి వెళ్లారు.
రోడ్డున పడ్డ బాధితులు – ప్రత్యేక బృందాల గాలింపు : మోసపోయామని గ్రహించిన 132 మంది బాధితులు సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. ప్రాథమిక విచారణలోనే వీరి పరిధిలో రూ.70 లక్షలకు పైగా మోసం జరిగినట్లు తేలింది. బాధితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, గృహిణులు కూడా ఉన్నారు. సర్వస్వం కోల్పోయామని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. పరారీలో ఉన్న అంకుశం, ఇతర డైరెక్టర్ల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

