Friday, May 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Tiranga Rally: భారత్ జోలికి వస్తే అదే వారికి చివరి రోజు- సీఎం చంద్రబాబు

Tiranga Rally: భారత్ జోలికి వస్తే అదే వారికి చివరి రోజు- సీఎం చంద్రబాబు

విజయవాడ నగరంలో శుక్రవారం దేశభక్తి జ్వాలలు ఎగసిపడ్డాయి. కేంద్రంలో జరిగిన ఆపరేషన్ సింధూర్ విజయానికి గుర్తుగా, దేశ సమైక్యత, సైనికుల త్యాగాలకు గౌరవంగా కూటమి ప్రభుత్వం ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించింది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు సాగిన ఈ ర్యాలీ, మువ్వన్నెల జెండాలతో ర్యాలీ నిర్వహించారు.

- Advertisement -

ర్యాలీలో సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, కూటమి నేతలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పెద్దఎత్తున పాల్గొన్నారు. జాతీయ జెండాలను చేతబట్టి ప్రజల నడుమకు దిగిన నేతలు, దేశభక్తి నినాదాలతో విజయవాడ నగరాన్ని దేశ మాత స్ఫూర్తిగా మార్చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు, ఉగ్రవాదులు భారతదేశంపై కన్నెత్తి చూడలేని విధంగా భారత సైనికులు బుద్ధి చెప్పారని అన్నారు. సింధూరం తుడిస్తే ఎలా ఉంటుందో ఈ దేశం చూపించిందని పేర్కొన్నారు. భారత్‌పై దాడి చేయాలనుకునే దుర్మార్గులకు ఇది గుణపాఠం కావాలి అని వ్యాఖ్యానించారు. భారత్ ఎవరి జోలికి వెళ్లదు, ఎవరిపైనా యుద్ధం చేయదని సీఎం చంద్రబాబు అన్నారు. కానీ తీవ్రవాదుల రూపంలో దేశంపైకి వస్తే మాత్రం వారికి అదే చివరి రోజు అవుతుందని ఆయన హెచ్చరించారు. ఉగ్రవాదులు ఎక్కడున్నా వారిని ఏరిపారేయాలన్నారు. టెర్రరిస్టులు ప్రపంచంలో ఎక్కడ దాకున్నా వారి అంతు చూసేందుకు ధృడ సంకల్పంతో ప్రధాని మోదీ ముందుకెళ్తున్నారని చంద్రబాబు చెప్పారు.

ఆపరేషన్ సిందూర్ లో మన సైనికుల ధైర్యం చూశాం. సామర్థ్యం చూశాం. మనం తయారు చేసుకున్న ఆయుధాల సత్తా చూశాం. ఆపరేషన్ సిందూర్ తో ఈరోజు ప్రపంచ దేశాల్లో భారత్ ప్రతిష్ట పెరిగింది. పొరుగు దేశాల్లో ఉండే శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దేశానికి సరైన సమయంలో సరైనా నాయకుడు, బలమైన నాయకుడు నరేంద్ర మోదీ ఉన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే సమర్థవంతమైన నాయకుడు కూడా మోదీనే. ఆపరేషన్ సిందూర్ తో ఆయన నిరూపించుకున్నారు. భారత్ రక్షణ శక్తిలోనే కాదు ఆర్థిక శక్తిలోనూ ముందుకు సాగుతోందని చంద్రబాబు అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News