టెక్నాలజీ ఎంత పెరిగినా కొన్ని విషయాల్లో మాత్రం ఇంకా పాత పద్ధతులే కొనసాతున్నాయి. ఒకప్పుడు ఎవరైనా క్షమించరాని తప్పు చేస్తే ఊరి నుంచి వెలివేసేవారు గ్రామ పెద్దలు. కాలం మారుతున్నా కొద్దీ ఈ అచారం కూడా తగ్గుతూ వచ్చింది. అయితే తాజాగా ఇలాంటి ఘటన మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఏపీలోని కాకినాడ(Kakinada) జిల్లా ఉప్పుమిల్లి గ్రామ పెద్దలు ఏకంగా ఏడు కుటుంబాలను వెలివేశారు. గ్రామస్తులెవరూ వారికి సహకరించకూడదని, శుభకార్యాలకు వెళ్లకూడదని, పనులకు పిలవకూడదని కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. గ్రామ బహిష్కరణకు గురైన కుటుంబాలన్నీ అధికార తెలుగుదేశం(TDP) పార్టీకి చెందినవి కావడం గమనార్హం.
ధాన్యం పాట సొమ్ముల విషయంతో పాటు రాజకీయ పార్టీలకు మద్దతును ప్రకటించే విషయంలో గ్రామస్తుల మధ్య వివాదం చోటు చేసుకుంది. దీంతో పంచాయితీ పెట్టిన గ్రామ పెద్దలు టీడీపీకి చెందిన ఏడు కుటుంబాలను వెలివేస్తూ తీర్మానించారు. వెలివేసిన గ్రామ పెద్దలు వైసీపీకి చెందినవారని బాధితులు తెలిపారు.
బాధితుడు మేడిశెట్టి దుర్గారావు కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన కాజులూరు తహసీల్దార్, గొల్లపాలెం ఎస్ఐ గ్రామానికి వచ్చి పరిస్థితిని తెలుసుకున్నారు. గ్రామ పెద్దలు, బాధితులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఇరు వర్గాల మధ్య రాజీ చేసే దిశగా రెవెన్యూ, పోలీసు అధికారులు చర్చలు జరిపారు.