Village Secretariats name change to Vision Units: రాష్ట్రంలో గ్రామ సచివాలయాల పేరు మారుస్తూ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి వాటిని ‘విజన్ యూనిట్స్’గా పిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన డేటా ఆధారిత పాలనపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో మంత్రులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో సమర్థంగా ప్రజలకు సేవలు అందించే కేంద్రాలుగా ‘విజన్ యూనిట్స్’ను రూపొందిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకుని పౌరులకు సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా అధికారులకు, ప్రజాప్రతినిధులకు సీఎం చంద్రబాబు పలు సూచనలు చేశారు.
‘గ్రామ సచివాలయాన్ని విజన్ యూనిట్‌గా మార్చుకుని సమర్ధంగా ఆ విభాగాన్ని వినియోగించుకుందాం. టెక్నాలజీ వినియోగంతో తుపాను సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని బాగా తగ్గించగలిగాం. రాష్ట్రస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకూ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసి ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించగలిగాం. డేటా ఆధారిత పాలన అనేది ఇప్పుడు అత్యంత కీలకమైన అంశంగా మారింది.’ అని సీఎం అన్నారు.
ఇకపై విజన్ యూనిట్స్ ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలను వేగంగా, సమర్థంగా అందించేందుకు ప్రత్యేక సాంకేతిక పద్ధతులను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. సంక్షేమ పథకాలు, రికార్డులు, సర్టిఫికెట్లు, ప్రభుత్వ సహాయ పథకాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేలా విజన్ యూనిట్స్ పనిచేయనున్నాయి. రాష్ట్ర భవిష్యత్తు పరిపాలనలో విజన్ యూనిట్స్ కీలక పాత్ర పోషిస్తాయని.. ఆధునిక సాంకేతిక సాయంతో గ్రామ స్థాయి పాలనను మెరుగుపరిచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.


