VIP Darshanam Tickets In Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే ప్రవాసాంధ్రులకు ఇప్పటి నుండి దర్శనం మరింత సులభతరం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజా ఆదేశాల మేరకు, విదేశాల్లో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ప్రతి రోజు 100 వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు కేటాయించనున్నారు. గత ప్రభుత్వ కాలంలో ఈ కోటా 50 నుంచి కేవలం 10కి తగ్గించడంతో, ఎన్నారైలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ సమస్యను గత ఫిబ్రవరిలో ఏపీఎన్ఆర్‌టీ (ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ) అధ్యక్షుడు రవి వేమూరి ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం సీఎం దృష్టికి తీసుకెళ్లింది. దానిపై స్పందించిన చంద్రబాబు నాయుడు తక్షణమే ఈ కోటాను 10 నుంచి 100కి పెంచాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులను ఆదేశించారు.
ప్రవాసాంధ్రులు ఈ సేవను పొందాలంటే ముందుగా https://apnrts.ap.gov.in/ అనే అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఉచితంగా సభ్యత్వం నమోదు చేసుకోవాలి. ఈ ప్రక్రియలో వారు నివసిస్తున్న దేశానికి సంబంధించిన వీసా మరియు వర్క్ పర్మిట్ వివరాలు అప్‌లోడ్ చేయాలి. సభ్యత్వం పూర్తయిన తర్వాత, వెబ్‌సైట్‌లో మూడు నెలల దాకా దర్శన స్లాట్లు చూపబడతాయి. అందులో తగిన తేదీని ఎంపిక చేసుకుని టికెట్‌కి అభ్యర్థించవచ్చు. అభ్యర్థించిన తేదీకి అనుగుణంగా టీటీడీ అధికారులు టికెట్లను కేటాయిస్తారు. టికెట్లు కేటాయించబడినవారికి, ఏపీఎన్ఆర్‌టీ ఎంబాసీ ప్రతినిధి (పీఆర్ఓ) ద్వారా వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించబడుతుంది. ఇంకా వివరాలు కావాలంటే ప్రవాసాంధ్రుల కోసం ఏర్పాటు చేసిన అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా ఏపీలోని తాడేపల్లి ఉన్న ఏపీఎన్ఆర్‌టీ కార్యాలయాన్ని 0863-2340678 నంబరులో సంప్రదించవచ్చు.


