Vizag City: ఏపీలో ఉన్న అందమైన నగరం విశాఖపట్నం. ఈ నగరానికి వాణిజ్యపరంగానే కాదు పర్యాటకంగానూ ప్రత్యేక స్థానం ఉంది. సెలవు రోజులను సరదాగా గడిపేందుకు ఇది సరైన గమ్యస్థానం. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా దేశ, విదేశీ టూరిస్టులు కూడా ఏటా వేల సంఖ్యలో విశాఖ సందర్శనకు వస్తుంటారు. విశాఖ నగరాన్ని వైజాగ్ అని కూడా పిలుస్తారు. విశాలమైన సాగరతీరం, ఎత్తైన కొండలు, ఉద్యానవనాలు, నోరూరించే ఆహార పదార్ధాలు, షాపింగ్, నైట్ లైఫ్ ఇలా పర్యాటకులకు దొరకనిదంటూ ఏదీ ఉండదు.
అదంతా ఒకవైపు అయితే పారిశ్రామికంగా విశాఖ ఏపీకి బంగారు బాతు గుడ్డు అనే చెప్పాలి. ఉమ్మడి రాష్ట్రంలోనే హైదరాబాద్ తర్వాత రెవెన్యూలో రెండో స్థానంలో ఉన్న విశాఖ విభజన అనంతరం ఏపీకి ప్రధాన ఆదాయ వనరు. ఇక, విశాఖలో కేంద్ర సంస్థలకు కొదువే లేదు. నేవీ, డిఫెన్స్, పోర్టులు ఇలా కేంద్ర సంస్థలు ఇక్కడ ఉండగా.. కేంద్ర ఉద్యోగులు ఎక్కువ శాతం రిటైర్మెంట్ తర్వాత కూడా విశాఖ నగరంలో స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకోవడంతో వివిధ రాష్ట్రాల ప్రజల కలయికగా విశాఖ కనిపిస్తుంది.
అలాంటి విశాఖను ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలనే ప్రయత్నం జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు డిల్లీ స్థాయిలో, ఉన్నతస్థాయిలో చర్చలు జరుగుతున్నాయని ఈ ప్రచారం యొక్క సారాంశం. ఇప్పటికే కేంద్ర మంత్రులు ఈమేరకు ఓ ప్రతిపాదన పెట్టారని.. ఇదివరకే కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పరిశీలించి వెళ్ళారని, త్వరలో ప్రతిపాదన వెలుగు చూస్తుందని చర్చలు జరుగుతున్నాయి.
అయితే.. ఉన్నఫలంగా విశాఖ లాంటి నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా నిర్ణయాలు తీసుకోవడం అంత ఈజీ కాదు. పైగా ఏపీకి ప్రధాన ఆదాయ వనరైన నగరాన్ని వదులుకునేందుకు సిద్ధంగా ఉండదు. కేంద్ర పాలిత ప్రాంతంగా విశాఖ అనేది కేవలం ప్రచారం మాత్రమేనని.. అది సాధ్యమయ్యేది కాదని కొందరి వాదన. ఏమో మరి.. అసలేం జరుగుతుంది.. ఈ ప్రచారం ఎందుకు మొదలైందన్నది ముందు ముందు చూడాల్సి ఉంది.