Google Investment Visakha : తెలుగుదేశం పార్టీ (TDP) విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం విశాఖ పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆయన, గత ఐదేళ్లలో అభివృద్ధి కన్నా విధ్వంసమే ఎక్కువ జరిగిందని ఘాటుగా విమర్శించారు.
భవిష్యత్తుపై పారిశ్రామికవేత్తల ఆందోళన:
“వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఏమిటి?” అని పారిశ్రామిక వర్గాలు తమ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాయని శ్రీ భరత్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఐదేళ్లలోనే పరిశ్రమలు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసేలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
పెట్టుబడులు, వైసీపీ అడ్డంకులు:
గూగుల్ సంస్థ ఏకంగా రూ.50,000 కోట్ల భారీ పెట్టుబడితో విశాఖపట్నానికి వస్తోందని ఎంపీ శ్రీ భరత్ స్పష్టం చేశారు. తర్లవాడలో ఎకరం రూ.50 లక్షలకే భూమి కేటాయిస్తున్నామని వెల్లడించారు. TCS వంటి సంస్థలకు భూమిని తక్కువ ధరకు ఇవ్వడానికి కారణం, అవి అత్యంత వేగంగా పెట్టుబడి పెడతాయనేనని తెలిపారు. రూ.8 వేల కోట్ల పైబడిన టర్నోవర్ ఉన్న సంస్థలకే తక్కువ ధరలకు భూములు ఇస్తున్నట్లు వివరించారు. పరిశ్రమలు రాకుండా వైసీపీ నేతలు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, వారు పోగుచేసుకున్న ల్యాండ్ పోతుందనే భయం వారికి ఉందని ఆరోపించారు.
జగన్ హయాంలో ఇన్ఫోసిస్‌కు ఎక్కడైనా భూమి ఇచ్చారా, ఏపీకి వచ్చిన కంపెనీలకు సౌకర్యాలు కల్పించారా అని ఆయన ప్రశ్నించారు. ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు పరిశ్రమలు పెట్టే దిశగా తమ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, అమెరికాలోని సంస్థలను, జీసీసీలను విశాఖకు రావాలని ఆహ్వానిస్తున్నామని ఎంపీ శ్రీ భరత్ తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు సొంత కాళ్లపై ఎదగడం వైసీపీ నేతలకు ఇష్టం లేదని మండిపడ్డారు.


