Visakhapatnam port cargo theft mafia : కంటికి రెప్పలా కాపాడే నిఘా నేత్రాలున్నా, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా విశాఖ సాగరతీరంలో నిలువుదోపిడీ నిర్విరామంగా సాగుతోంది. నౌకల ద్వారా దిగుమతి అయ్యే అపార ఖనిజ సంపద అసలైన కంపెనీలకు చేరకుండానే దొడ్డిదారిన నల్లబజారుకు తరలిపోతోంది.
కోట్ల విలువైన సరకు లూటీ: ఇటీవల ‘ఎమ్వీటీ ప్రైమ్’ నౌక ద్వారా దిగుమతైన 26,400 మెట్రిక్ టన్నుల మాంగనీస్లో ఏకంగా 1,085 టన్నులను దారి మళ్లించారు. దీని విలువ సుమారు రూ.2.50 కోట్లు. ‘మెరైన్ మార్వెల్స్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్’ ప్రతినిధులు హార్బర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ గుట్టు రట్టయింది.
పక్కా వ్యూహం.. పక్కదారి రవాణా: పోర్టు నుంచి అసలు కంపెనీకి పది లారీలు బయలుదేరితే, మరో పది లారీలను బహిరంగ బ్లాక్ మార్కెట్కు మళ్లిస్తారు. కొనుగోలుదారులు జీఎస్టీ చెల్లించి సక్రమ రవాణాగా నమ్మిస్తారు. బరువు తూకంలో తేడా రాకుండా బొగ్గును నీటితో తడపడం, నిర్వహణ లోపంగా సాకులు చెప్పడం వీరికి వెన్నతో పెట్టిన విద్య.
రక్షణ కవచంగా యంత్రాంగం: పీపీపీ బెర్తుల పర్యవేక్షకులు, భద్రతా సిబ్బందితో పాటు హార్బర్ పోలీసులకు నెలవారీ ముడుపులు అందుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కానిస్టేబుల్ కాల్పుల ఘర్షణలు ఈ చీకటి బంధానికి అద్దంపడుతున్నాయి. నిఘా లోపాలను అడ్డుపెట్టుకుని సాగుతున్న ఈ దోపిడీపై ఉన్నత స్థాయి విచారణ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

