తనకేమైనా జరిగితే వైసీపీ నేతలు, వివేకా హత్య కేసు నిందితులదే బాధ్యత అని మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య(Viveka Murder Case) కేసు నిందితుడు సునీల్ యాదవ్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి తనపై ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఈమేరకు కపడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాను కోట్ల రూపాయలు సంపాదించానని రాచమల్లు ఆరోపణలు చేశారని అన్నారు. తన వద్ద రూ. కోట్లు ఎక్కడున్నాయో రాచమల్లు నిరూపించాలని డిమాండ్ చేశారు.
ప్రొద్దుటూరులో బీసీ నేతను ఎవరు చంపించారో అందరికీ తెలుసని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాచమల్లు ఎవరి కాళ్లు పట్టుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. వివేకా మర్డర్ ఆధారంగా తీసిన హత్య సినిమాపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆయనకెందుకు అంత ఉలికిపాటు? అని మండిపడ్డారు. ఈ సినిమాలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, ఉదయ్ పాత్రలు ఎందుకు చూపలేదు? అని నిలదీశారు. ఆ సినిమాలో తనను విలన్‌గా చూపించారని ఫైర్ అయ్యారు. వైసీపీ నాయకులే సినిమాను తీశారనే అనుమానం కలుగుతోందన్నారు. తనకు వైసీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని సునీల్ వెల్లడించారు.