YS Viveka Murder Case : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పును వెలువరించింది. జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ ఎన్.కె. సింగ్‌ల ధర్మాసనం ఈ కేసును విచారించింది. వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, అప్పటి సీబీఐ అధికారి రాంసింగ్‌పై నమోదైన కేసులను కొట్టివేస్తామని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులు కుట్రపూరితంగా దాఖలు చేసినవిగా ధర్మాసనం వెల్లడించింది.
ఈ కేసు విషయంలో సునీత తరఫున న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ప్రధాన నిందితుల్లో ఒకరైన అవినాష్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని కోరారు. సీబీఐ గడువు కారణంగా దర్యాప్తును తొందరగా ముగించినట్లు లూథ్రా వాదించారు. ఈ హత్య కేసులో అసలు సూత్రధారులు, పాత్రధారులను గుర్తించేందుకు మరింత లోతైన దర్యాప్తు అవసరమని పేర్కొన్నారు. సాక్షులను బెదిరించడం, సాక్ష్యాలను నాశనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కోర్టుకు వెల్లడించారు. సునీత, రాజశేఖర్ రెడ్డి, రాంసింగ్‌పై దాఖలైన కేసులు రాజకీయ దురుద్దేశంతో నమోదు చేసినవని లూథ్రా వివరించారు.
ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు, ఆ కేసులను కొట్టివేయాలని నిర్ణయించింది. ఈ తీర్పు కేసు దర్యాప్తులో కొత్త మలుపు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ హత్య కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సీబీఐ దర్యాప్తు మరింత లోతుగా జరిగితే నిజమైన నిందితులు బయటపడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


