Homeఆంధ్రప్రదేశ్Vizag :విశాఖ పోలీసుల తీరు దారుణం

Vizag :విశాఖ పోలీసుల తీరు దారుణం

విశాఖపట్నం, (తెలుగు ప్రభ): విశాఖ పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించడం లేదని, పోలీసులకు ఎలాంటి అధికారం లేని ‘బడ్స్’ కేసుల్ని రెండేళ్ల వ్యవధిలో సుమారు 200కు పైగా కేసులు నమోదు చేయించి, ఎంతోమందిని జైలుకు పంపించారని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి కార్తిక్ సిద్దార్థ థ్వజమెత్తారు. సహచర న్యాయవాదులు గీతా ప్రసన్న, వంశీకృష్ణ, సుభాష్‌తో కలిసి పౌరగ్రంథాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. 2024లో విశాఖ సీపీగా బగ్చీ బాధ్యతలు చేపట్టాక దేశంలో మరెక్కడా లేని విధంగా ‘బడ్స్’ కేసులు నమోదు చేయించి, నిందితులకే న్యాయం జరిగేలా పోలీసులు పరోక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 2019లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తీసుకు వచ్చిన బడ్స్ చట్టంలో ప్రత్యేక వ్యవస్థ ఉందని, బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు మాత్రమే నమోదు చేసి, ఆ ప్రత్యేక వ్యవస్థకు అప్పగించాల్సిన పోలీసులు అంతకు మించి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

- Advertisement -

అయినప్పటికీ ఒక్క కేసులోనూ బాధితులకు న్యాయం జరగలేదన్నారు. జూలై 2024లో తొలికేసు నమోదైందని, 500మందికి పైగా జైలుకు పంపించారని, కేసుల వివరాల్ని ప్రిన్సిపల్ సెక్రటరీకి తెలియజేయాల్సి ఉన్నా పోలీసులు అలా వ్యవహరించడం లేదని విమర్శించారు. ఇవన్నీ తాము ప్రశ్నిస్తున్నామనే అక్కసుతో న్యాయవాది గీతా ప్రసన్నపై విశాఖ పోలీసులు అనేక కేసులు బనాయించారని ఆరోపించారు. ఎలాంటి సంబంధం లేని ఆమె భర్తపైనా ఎఫ్ఐఆర్‌లు నమోదు చేస్తున్నారన్నారు. విశాఖ పోలీసులు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. 2024లో సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనల్నీ పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు.

సీపీకి బిట్ కాయిన్ ఇచ్చారు

2023నాటి జాయ్ జమీమా కేసులో విశాఖ పోలీసులపై అనేక ఆరోపణలొచ్చాయని ఎలాంటి సంబంధం లేని ఒక చిన్నారినీ జైలుకు పంపించారని, 2024లో అజీమ్ ఖాన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై జాయ్ జమీమానూ జైలుకు పంపించారని న్యాయవాది గీతా ప్రసన్న తెలిపారు. రతన్‌రాజు అనే నిందితుడి వివరాల మేరకు పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారన్నారు. ఆయా కేసులకు సంబంధించి విశాఖ సీపీ బగ్చీకు తాను బిట్ కాయిన్ ఇచ్చానని ఒక వ్యక్తి చెప్పిన ఆధారాల మేరకు తాను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశానన్నారు. ఇవన్నీ ప్రశ్నిస్తున్నందుకే 20మంది పోలీసులు తనింటికి వచ్చి రభస చేశారని ఆరోపించారు. సంబంధం లేని కేసుల్ని ముడివేసి సీపీ ఒక పెన్‌డ్రైవ్ తయారు చేయించి, కోర్టుకిచ్చారన్నారు.

కరిష్మా కేసులో నేతలున్నారు

కరిష్మా అనే యువతి తనకు అన్యాయం జరిగిందని తనను ఆశ్రయించగా ఆ కేసు పూర్వాపరాలు విన్నానని గీతా ప్రసన్న తెలిపారు. ఈ కేసు అనేక మలుపులు తిరగ్గా విశాఖకు చెందిన ఒక ఎమ్మెల్యే, సాయిరాం అనే వ్యక్తి తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే తనతో జరిపిన సంభాషణ ఉందన్నారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకే పోలీసులు, సాయిరాం వ్యవహరిస్తున్నారన్నారు. గత మార్చిలో జరిగిన ఈ కేసు విషయంలో ఎమ్మెల్యేతో పాటు పోలీసులు కూడా తనను టార్గెట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ సీపీకి బిట్ కాయిన్ ఇచ్చారనే ఆరోపణలపై తాను కోర్టుకెళ్లినందుకే తనపై ఇన్ని కేసులు నమోదు చేయించారని గీతా ప్రసన్న ఆరోపించారు. విశాఖ పోల్ణీసుల తీరుపై గత ఆగస్టు 17న కోర్టు కూడా స్పందించిందని, న్యాయవాదులపైనా అక్రమ కేసులు నమోదు చేసే సంస్కతి దాపురించిందని కార్తీక్ సిద్దార్ధ ఆవేదన వ్యక్తం చేశారు.

మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీ అంబేడ్కర్ తన విచక్షణ మరిచి మరీ న్యాయవాది గీతాప్రసన్నపై బార్ కౌన్సిల్‌కు ఫిర్యాదివ్వడం దారుణమన్నారు. సైబర్ క్రైం సీఐ కూడా తనకు మెసేజీలు చేసి, తాను చెప్పినట్టు వినాలని సూచించినట్టు తెలిపారు. బిట్ కాయిన్ ఇచ్చారన్న విషయం నిజమా కాదా అన్న విషయంపై పోలీసులు ఎందుకు వివరణ ఇవ్వడం లేదన్నారు. గత ఏప్రిల్‌తో తాను స్వయంగా ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తూ సీపీకి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని గీతా ప్రసన్న స్పష్టం చేశారు. పోలీసులు అరాచకాల్ని ప్రశ్నిస్తున్నందుకే తనపై 8కేసులు పెట్టించారని, తాము కూడా న్యాయస్థాన్ని ఆశ్రయిస్తామని, జాయ్ జమీమా కేసు మాదిరే కరిష్మా కేసును పక్కదోవ పట్టించొద్దని తానే సీపీని కోరానని గీతా ప్రసన్న తెలిపారు.

ప్రెస్‌మీట్‌లో ‘సాయిరాం’ హల్‌చల్

పౌర గ్రంథాలయంలో న్యాయవాదులు మీడియతో మాట్లాడుతున్న సమయంలో కరిష్మా కేసులో వివిధ ఆరోపణలెదుర్కొంటున్న సాయిరాం అనే వ్యక్తి అక్కడకు వచ్చి వచ్చి హల్‌చల్ చేశాడు. ఎవరేం చెబితే అది మీడియా రాసేస్తోందని, తనపై న్యాయవాదులు ఆరోపణలు చేస్తున్న విషయాన్ని ఖండించేందుకు అక్కడకు వచ్చానంటూ హడావుడి చేశాడు. ప్రెస్ మీట్ ను అడ్డుకున్నాడు. న్యాయవాదులు ప్రెస్‌మీట్ పెట్టినప్పుడు మీరు రావాల్సిన అవసరం ఏంటని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, వారిని కూడా సాయిరాం దూషించాడు. తనకు జరిగిన అన్యాయం చెప్పుకొనేందుకు వచ్చానన్నాడు. ఆ విషయం ప్రెస్ ద్వారా, పోలీసుల ద్వారా, ప్రెస్‌నోట్ ద్వారా చెప్పొచ్చని మీడియా ప్రతినిధులు చెబుతున్నా పేర్లు పెట్టి మరీ అందరికీ అడ్డుతగిలాడు. నరేష్ అనే మీడియా ప్రతినిధి తమకు ఇబ్బందులు పెట్టాడంటూ ఆరోపించాడు.

ఈ లోగా న్యాయవాదులకు, సాయిరాంకు మధ్య ఘర్షణ తలెత్తింది. ఎమ్మెల్యే మనిషి కాబట్టే ఎవరూ పిలవకపోయినా సాయిరాం అక్కడకు వచ్చి గలాటా సృష్టిస్తున్నాడంటూ న్యాయవాదులు మండిపడ్డారు. విషయం తెలుసుకున్న ద్వారకా పోలీసులు పౌరగ్రంథాలయానికి వచ్చి వారిస్తున్నా సాయిరాం ఇష్టమొచ్చినట్టు అందర్నీ దూషించాడు. తాను కూడా కోర్టుకు వెళ్తానని, కోర్టులో లావాదేవీలు జరుగుతుండగా న్యాయవాదులు ప్రెస్‌మీట్ పెట్టి తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, అందుకే తానొచ్చానని చెప్పుకొచ్చాడు.

నన్ను కాపాడండి: కరిష్మా

సాయిరాం వెంట వచ్చిన కరిష్మా కూడా తనను ఎవరూ ఆదుకోవడం లేదని, న్యాయవాదులంతా తన స్వేచ్ఛను హరించేలా వ్యవహరిస్తున్నారంటూ కన్నీరుమున్నీరయ్యారు. తనపై లేనిపోనివి సృష్టించి, తన హక్కుల్ని కాలరాస్తున్నారని, తనకు న్యాయం జరిగేంతవరకు ఇక్కడి నుంచి కదిలేని లేదని పౌర గ్రంథాలయ ఆవరణలో భీష్మించుకు కూర్చున్నారు. తనపై ఆరోపణలుంటే రుజువు చేయాలని, తన కుటుంబాన్ని రోడ్డున పడేసేందుకు కొన్ని శక్తులు పని చేస్తున్నాయని కన్నీంటి పర్యంతమయ్యారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న ద్వారకా సీఐ ఉమా మహేశ్వరరావు రంగప్రవేశం చేసి న్యాయవాదుల్ని, కరిష్మాను, సాయిరాంను ఆయన వెంట వచ్చిన వారిని స్టేషన్‌కు తరలించారు. మొత్తానికి న్యాయవాదులు ప్రెస్‌మీట్ పెట్టినప్పుడు సాయిరాం అక్కడకు వచ్చి ఉండకపోతే ఇదంతా జరిగేది కాదని, దీనంతటికీ కారణం సాయిరామేనని అక్కడివారంతా పోలీసులకు తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News