Vizianagaram| విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రద్దు అయింది. వైసీపీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు కుటుంబసభ్యులు అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. అయితే ఆయన పార్టీలో చేకపోయినా ఆయనపై మండలి ఛైర్మన్ అనర్హత వేటు వేశారు. దీంతో మండలి ఛైర్మన్ నిర్ణయాన్ని రఘురాజు ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం మండలి ఛైర్మన్ నిర్ణయాన్ని తప్పుబట్టింది. రఘురాజుపై అనర్హత వేటు చెల్లదని.. అతడిని ఎమ్మెల్సీగా కొనసాగించాలని తీర్పు ఇచ్చింది.
కానీ అప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఎన్నిక నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. తాజాగా హైకోర్టు ఉత్తర్వులు ఈసీకి అందడంతో.. గతంలో జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.