VRO Association complaint against RDO officer: వీఆర్వోతో చేత ఆర్డీఓ గుంజీలు తీయించిన ఘటన శ్రీసత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. దీంతో వీఆర్వోలంతా ఆ లేడీ ఆఫీసర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇంతకీ ఆ లేడీ ఆఫీసర్ ఎవరు..ఎందుకు అలా ప్రవర్తించిందో తెలుసుకుందాం!
తాజాగా వెలుగులోకి: పనితీరు బాగలేని వీఆర్వో చేత శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ గుంజీలు తీయించారు. దీంతో ఏపీలో ఈ ఘటన కలకలం రేపుతోంది. ఓ అధికారి మరో అధికారి పట్ల ఇలాగేనా ప్రవర్తించేదని వీఆర్వోల సంఘం ప్రశ్నిస్తుంది. ఈనెల 18న పుట్టపర్తి మండల పరిషత్ కార్యాలయంలో ఈ ఘటన జరగగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో సదరు ఆర్డీఓపై కలెక్టర్ శ్యామ్ ప్రసాద్‌కు వీఆర్వోలు ఫిర్యాదు చేశారు. అయితే ఈ విషయంపై ఆర్డీఓతో మాట్లాడుతానని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు.
అసలేం జరిగిందంటే: శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి ఆర్డీవో కార్యాలయంలో ఆధార్ అప్డేషన్‌పై వీఆర్వోలకు ప్రత్యేక శిక్షణ ప్రోగ్రామ్ జరిగింది. ఈ ట్రైనింగ్ సెషన్‌లో ఒడిసి మండలం వీఆర్వోపై ఆర్డీవో సువర్ణ మండిపడ్డారు . ఆధార్ అప్డేట్‌లో చాలా వెనకబడ్డారంటూ ఫైర్ అయ్యారు. ఆర్డీవో అధికారిణి అడిగిన ప్రతి ప్రశ్నలకు వీఆర్వో సమాధానం ఇచ్చారు. ఆధార్ అప్డేషన్ జరగకపోవడానికి గల కారణాలను సమగ్రంగా వివరించాడు. చాలామంది బెంగళూరుకు వలస వెళ్లడంతో.. ఆధార్ అప్టేషన్ పూర్తి చేయలేకపోయానంటూ ఆర్డీవోకి వీఆర్వో సమాధానం ఇచ్చారు. వీఆర్వో చెప్పిన సమాధానం ఆర్డీవో సువర్ణకు నచ్చకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైయ్యారు. ఎప్పుడూ ఒకే కారణం చెబుతూ తప్పించుకుంటావా అంటూ వీఆర్వోపై సువర్ణ మండిపడ్డారు. అంతటితో ఆగకుండా ఆధార్ అప్టేషన్ ఆలస్యానికి తగిన శిక్షగా.. గుంజీలు తీయాలంటూ ఆర్డీవో ఆదేశించారు. ఆర్డీవో ఆర్డర్ వేయడంతో చేసేదేమీలేక.. మిగతా వీఆర్వోల ముందే గుంజీలు తీశారు. దాంతో.. అక్కడున్న వీఆర్వోలందరూ ఆర్డీవో సువర్ణను ప్రశ్నించారు. ఇలాంటి నియంతృత్వ పోకడ సరికాదంటూ ఆమెతో వాగ్వాదానికి దిగారు. వెంటనే గుంజీలు తీయించడం ఆపాలని విజ్ఞప్తిచేశారు.
వెనక్కు తగ్గని ఆర్డీఓ: అయితే ఆర్డీఓ మాత్రం అస్సలు వెనక్కు తగ్గలేదు. ఎంతమంది చెప్పినా వినకుండా వీఆర్వోతో గుంజీలు తీయించారు. దాంతో మిగితా వీఆర్వోలు చేసేదేమీ లేక వెంటనే.. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించారు. తమను ఆర్డీవో సువర్ణ అవమానించారంటూ కలెక్టర్ శ్యాంప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన కలెక్టర్ పూర్తి విచారణ జరిపి..తగు చర్యలు తీసుకుంటానని వీఆర్వోలకు హామీ ఇచ్చారు.


