AP weather report: ఏపీలో భిన్న వాతావరణం కొనసాగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. కొన్ని జిల్లాల్లో ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరుతుండగా.. మరికొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదివారం రాష్ట్రంలో ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
నిప్పుల కొలిమిగా నెల్లూరు జిల్లా: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో ఆదివారం 46.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది ఇప్పటివరకు ఇదే అత్యధికమని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కొప్పెరపాడులో 46.1 డిగ్రీలు రికార్డయింది. రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాల పరిధిలోని 286 మండలాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల మార్కును దాటాయి.
Also read-Red Alert: తెలంగాణలో భానుడి భగభగ.. నిజామాబాద్‌లో 46 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత!
ద్రోణి ప్రభావంతో వర్షాలు: దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, ఏపీ మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అనకాపల్లి, కాకినాడ, డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు (పోలవరం), విశాఖపట్నం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున వర్షం కురిసే సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండవద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

