Weather report: ఏజెన్సీ ప్రాంతంలో చలి పంజా విసురుతోంది. బుధవారం తెల్లవారుజాము నుంచే మన్యంపై దట్టమైన పొగమంచు కమ్మేసింది. ముఖ్యంగా పాడేరు ప్రాంతంలో ఉదయం 8 గంటల వరకు పొగమంచు విపరీతంగా కురవడంతో జనజీవనం స్తంభించింది.
ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు: గత రెండు రోజులతో పోలిస్తే బుధవారం ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. చింతపల్లిలో మంగళవారం 12.2 డిగ్రీలుగా ఉన్న ఉష్ణోగ్రత, బుధవారం నాటికి 7.1 డిగ్రీలకు చేరుకుంది. అంటే కేవలం 24 గంటల్లోనే 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రత తగ్గడం గమనార్హం. తీవ్రమైన చలి గాలుల కారణంగా స్థానిక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రజలు రోజంతా ఉన్ని దుస్తులు ధరించి కనిపిస్తుండగా, ఉదయం మరియు సాయంత్రం వేళల్లో చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. నెలాఖరు వరకు ఈ చలి తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉందని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు వెల్లడించారు.
బుధవారం నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు:
- హుకుంపేట- 5.6°
- జి.మాడుగుల- 6.0°
- అరకులోయ- 6.4°
- పెదబయలు- 6.8°
- ముంచంగిపుట్టు- 6.9°
- చింతపల్లి- 7.1°
- కొయ్యూరు- 11.0°
పర్యాటకులకు కనువిందు: ఒకవైపు చలి తీవ్రత ఇబ్బంది పెడుతున్నా.. మరోవైపు ప్రకృతి ప్రేమికులకు ఈ వాతావరణం ఎంతో ఆహ్లాదాన్నిస్తోంది. అరకులోయ, వంజంగి, తాజంగి పర్యాటక ప్రాంతాలు మంచు అందాలతో మెరిసిపోతున్నాయి. ఈ అద్భుత దృశ్యాలను తిలకించేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

