Heavy rain in Vijayawada: విజయవాడలో వర్షం దంచికొడుతుంది. శనివారం అర్థరాత్రి ఎడతెరిపిలేని వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. విజయవాడ బస్టాండ్ వద్ద గల రైల్వే ట్రాక్ క్రింద భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో ప్రైవేట్ ట్రావెల్‌కు చెందిన బస్సు వరద నీటిలో చిక్కుకుంది. వెంటనే అప్రమత్తమైన విపత్తు నిర్వహణ సిబ్బంది బస్సులో ప్రయాణిస్తున్న వారిని సురక్షితంగా కాపాడారు.
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మచలీపట్నంలో సైతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం అర్థరాత్రి నుండి ఎడతెరపిలేని వర్షం పడుతుంది. దీంతో పలు ప్రాంతాలు జలమయమైనాయి. అధికారులు అప్రమత్తమయ్యారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేటప్పుడు ప్రజలు చెట్ల కింద నిల్చోవద్దని సూచించారు. రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
వాయుగుండంగా బలపడే అవకాశం: ఇదిలా ఉండగా.. ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. దీని ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాగల 48 గంటల్లో పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ దక్షిణ మధ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Also Read:https://teluguprabha.net/andhra-pradesh-news/northeast-monsoon-comes-telugu-states-in-this-week/
వరుస అల్పపీడనాలు: ఈశాన్య రుతుపవనాల రాకతో అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య వరుస అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా తుపాన్లు సైతం రానున్నాయని తెలిపారు. ఇవి తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్ వద్ద తీరందాటే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు నైరుతి నిష్క్రమణ కారణంగా రానున్న నాలుగు రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని అన్నారు.


