Wednesday, September 18, 2024
Homeఆంధ్రప్రదేశ్TDP-BJP: 2014 పునరావృతమౌతుందా.. ఎంపీ ఆర్ఆర్ఆర్ అదే చెప్పారా?

TDP-BJP: 2014 పునరావృతమౌతుందా.. ఎంపీ ఆర్ఆర్ఆర్ అదే చెప్పారా?

- Advertisement -

TDP-BJP: నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు పేరుకు ముందు వెనక వైసీపీ రెబెల్ ఎంపీ అనే విశేషం ఉన్న వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే రఘురామ కృష్ణం రాజు జగన్ పాలనా వైభోగాన్ని ఊహించారు. ఇక అక్కడి నుంచి రచ్చబండలో జగన్ రెడ్డి దుర్మార్గ పాలనను ఎండగడుతూ వస్తున్నారు. ఆ కారణంగా సహజంగానే జగన్ రెడ్డి ప్రభుత్వం ఆగ్రహానికి గురయ్యారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం ఆయన్ను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించింది. సామ దాన భేదోపాయలను ప్రయోగించింది. ఆయన నోటికి తాళం వేసే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం ఫలించలేదు. చివరకు పోలీసులకు పని చెప్పింది. పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడమే కాకుండా, ఆయన ఒక ఎంపీ అని కూడా చూడకుండా తమదైన పద్దతిలో ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. అంటే జగన్ ఆయనపై దండోపాయం కూడా ప్రయోగించింది. అయినా ఆయన మారలేదు. దారికి రాలేదు. అన్నిటినీ మించి ఆయన తన సొంత నియోజక వర్గంలో కాలుపెట్టకుండా వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది. ఆయన ఎంపీగా గెలిచి మూడున్నరేళ్ళు అవుతున్నా, మొదటి ఐదారు నెలల్లో తప్పించి, ఆ తర్వాత మళ్ళీ నియోజకవర్గంలో కాలు పెట్టలేదు. పెట్టలేదు అనే కంటే జగన్ రెడ్డి ప్రభుత్వం, వైసీపీ నాయకత్వం ఆయన నియోజక వర్గంలో అడుగు పెట్టకుండా అడ్డుకుంది.

ఇక ప్రస్తుతంలోకి వస్తే, ఆయన ఐదేళ్ళ పదవీ కాలం ముగింపు కోస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. రాజకీయ యుద్ద సన్నాహాలు, పొత్తుపొడుపులపై చర్చలు మొదలయ్యాయి. లోక్ సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్న నేపధ్యంలో అటు అధికార వైసీపీ, ఇటు ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం ఎన్నికలకు సిద్దమవుతున్నాయి. ఈ నేపధ్యంలో రఘురామ కృష్ణం రాజు రాజకీయ భవిష్యత్ ఏమిటి? ఆయన మళ్ళీ నర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తారా? చేస్తే, ఏ పార్టీ టికెట్ మీద పోటీ చేస్తారు? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

వైసీపీ ఆయనకు మళ్ళీ టికెట్ ఇవ్వదు. ఒక వేళ ఇచ్చినా, పుచ్చుకునేందుకు అయన సిద్దంగా లేరు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. కనుక ఆయన ఏ పార్టీలో చేరతారు? అనే ప్రశ్న చర్చకు వచ్చింది. ఒకప్పుడు ఆయన బీజేపీలో చేరతారనే ప్రచారం జరిగింది. మీడియాలో ముహూర్తాలు కూడా ఖరారయ్యాయి. మరోవంక ఆయన కూడా బీజేపీ వైపు మొగ్గుచూపుతున్న సంకేతాలు ఇచ్చారు. ఢిల్లీ బీజేపీ నాయకులతో పాటుగా, నాగపూర్ ఆర్ఎస్ఎస్ నాయకులతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా వార్తలొచ్చాయి. పార్లమెంట్ లోపల వెలుపల కూడా ఆయన ఆర్ఎస్ఎస్ భాషలో మాట్లాడుతూ వచ్చారు. బీజేపీ ప్రభుత్వం కూడా ఆయనకు వై కేటగిరీ రక్షణ కలిపించడంతో పాటుగా ఇతర సదుపాయాలు కల్పించింది. అయితే, ఏమైందో ఏమో కానీ ఆయన బీజేపీలో అయితే చేరలేదు.

అదలా ఉంటే, ఇప్పడు పుణ్య కాలం పూర్తవుతున్న నేపధ్యంలో ఆయన తమ రాజకీయ భవిష్యత్ తో పాటుగా రాష్ట్ర రాజకీయ భవిష్యత్ ముఖ చిత్రం గురించి కూడా తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చారు. ఎవరు ఏ పార్టీలో చేరతారు, ఏ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది అనేది అప్రస్తుతం. 2024 ఎన్నికలలో రెండు కాదు, మూడు ప్రధాన పార్టీలు కలిసి కూటమిగా పోటీ చేస్తాయి. నిజానికి, జనం ఇప్పటికే జగన్ రెడ్డి పాలనకు వీడ్కోలు పలికేందుకు సిద్దంగా ఉన్నారని రఘురామ రాజు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇప్పుడు బంతి నాయకుల చేతిలో ఉందని, పార్టీలు కలవకపోతే నాయకులకే నష్టమని కూడా ఆయన తన అభిప్రాయంగా చెప్పారు.

ఇక తాను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననే ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమధానమే ఇచ్చారు. వైసీపీని ఓడించే ప్రధాన కూటమి అభ్యర్ధిగా పోటీ చేస్తానని నర్మగర్భంగా అయినా ఆయన ప్రధాన ప్రతిపక్ష (టీడీపీ) కూటమి తరపున పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. సరే, నేరుగా తెలుగు దేశం పార్టీలో చేరతారా లేక మరో మార్గంలో టీడీపీ కూటమితో జట్టు కడతారా అనే విషయాన్ని పక్కన పెడితే, నిస్సందేహంగా ఆయన టీడీపీ, చంద్రబాబు నాయుడు సారధ్యంలో టీడీపీ, బీజేపీ, జన సేన కూటమి ఏర్పడాలని కోరుకుంటున్నారు అనేది మాత్రం శషబిషలు లేకుండా తేల్చేశారు.

రఘురామ కృష్ణం రాజు అభిప్రాయాన్ని, ఆయన ఆ మనసులోని మాటను, జరుగతున్న పరిణామాలను గమనిస్తే, 2024లో 2014 పునరావృతం కావడం ఖాయంగా కనిపిస్తోందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. తెలుగు దేశం పార్టీకి లభిస్తున్న ప్రజాదరణను, అదే విధంగా వైసిపీ ప్రభుత్వం గడప గడపన ఎదుర్కున్న వ్యతిరేకతను గుర్తించే, బీజేపీ నాయకత్వం పునరాలోచనలో పడిందని, అందులో భాగంగానే, జీ-20 భాగస్వామ్య దేశాల సమావేశాలపై చర్చినేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సారధ్యంలో, వచ్చే నెల ( డిసెంబర్) 5న ఢిల్లీలో ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక ఆహ్వానం అందిందని పరిశీలకులు భావిస్తున్నారు. నిజానికి, బీజేపీ జాతీయ నాయకత్వం, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ, అవకాశం చిక్కిన ప్రతి సందర్భంలో చంద్రబాబు నాయుడుతో మైత్రీని కోరుకుంటున్న సంకేతాలు ఇస్తూనే ఉన్నారని అంటున్నారు. గత ఆగస్టులో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఆజాదీకా అమృతోత్సవ్ పై జరిగిన సమావేశానికి కూడా చంద్రబాబుకు ఆహ్వానం అందిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News