RamGopal Varma| వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం చిక్కుల్లో పడ్డారు. ఆయనపై ఏపీలో పలు చోట్ల కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసుల్లో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆర్జీవీ(RGV) ఆశ్రయించారు. ఇప్పటికే వీటిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇవాళ్టికి వాయిదా వేసింది. దీంతో ఆర్జీవీ ముందస్తు బెయిల్ పిటిషన్లపై న్యాయస్థానం విచారణ చేయనుంది. ఈ నేపథ్యంలో ఆయనకు ఊరట దక్కుతుందా..? లేదా..? అనేది కాసేపట్లో తేలిపోనుంది. ఒకవేళ బెయిల్ పిటిషన్లు కోర్టు కొట్టివేస్తే మాత్రం ఆర్జీవీ తప్పుకుండా అరెస్ట్ అయ్యే పరిస్థితి ఉంది.
కాగా పోలీసులు అరెస్ట్ చేస్తారనే సమాచారంతో రామ్‌గోపాల్ వర్మ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో ఆయన పారిపోయారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆర్జీవీ ఓ వీడియో రిలీజ్ చేశారు. తాను ఎక్కడికి పారిపోలేదని.. ఎవరికి భయపడలేదని తెలిపారు. సంవత్సరం క్రితం తాను వేసిన ట్వీట్లకు ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయని కేసులు పెడుతున్నారని.. ఒకేరోజు వేరు, వేరు ప్రాంతాల్లో నలుగురికి మనోభావాలు దెబ్బ తిన్నాయా? అని ప్రశ్నించారు. తాను ఎవరిపై ట్వీట్లు వేశానో.. వారి మనోభావాలు దెబ్బ తినకుండా ఎవరికో మనోభావాలు ఎలా దెబ్బ తింటాయి..? దీనికి కేసులు ఎలా వర్తిస్తాయి అని నిలదీశారు.