Woman Aghori| కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన మహిళా అఘోరీ.. తాజాగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి(Srikalahasti)లో ప్రత్యక్షమైంది. ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకోవడానికి ప్రయత్నించింది. అయితే పోలీసులు అఘోరీని అడ్డుకున్నారు. దీంతో ఆమె పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే తన కారులో ఉన్న పెట్రోల్ డబ్బా తీసి ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే అప్రమత్తమైన లేడీ పోలీసులు ఆమెపై నీళ్లు పోసి బట్టలు కట్టే ప్రయత్నం చేశారు. అయితే తాను అఘోరీని అని.. బట్టలు కట్టుకోనని హల్‌చల్ చేసింది.
నగ్నంగా ఆలయంలోకి వెళ్లనీయమని పోలీసులు చెప్పడంతో.. దర్శనం చేసుకోకుండా తిరిగి ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. కావాలంటే గన్‌తో షూట్ చేసి చంపేయండి అని ఫైర్ అయింది. తాను చట్టాన్ని నమ్మనని.. కేవలం ధర్మాన్ని మాత్రమే నమ్ముతానని పేర్కొంది. రాష్ట్రంలో చిన్నపిల్లలు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే మీ పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. దీంతో పోలీసులు అఘోరీని అంబులెన్స్‌లో అక్కడి నుంచి పంపించేశారు.
కాగా ఇటీవల తెలంగాణలో అఘోరీ వ్యవహారం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. కొండగట్టు, వేములవాడ ఆలయాలను దర్శించుకున్న ఆమె.. ఆత్మార్పణం చేసుకుంటానని ప్రకటించింది. దీంతో అక్కడి పోలీసులు ఆమెను రెండు రోజులు స్వగ్రామంలో నిర్బంధించారు. అనంతరం తెలంగాణ సరిహద్దుల నుంచి మహారాష్ట్రలోకి పంపించేశారు. అయితే అక్కడి నుంచి అఘోరీ నేరుగా ఆంధ్రప్రదేశ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలుత విశాఖ వెళ్లి అక్కడ హల్ చల్ చేసింది. పోలీసులు అడ్డుకోవడంతో తాజాగా శ్రీకాళహస్తిలో ప్రత్యక్షమైంది. మొత్తానికి అఘోరీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల పోలీసులకు తలనొప్పిగా మారింది.