Merugu Nagarjuna| ఏపీ మాజీ మంత్రి మేరుగు నాగార్జున చిక్కుల్లో పడ్డారు. తనను మోసం చేసి లైంగికంగా వేధించారంటూ ఆయనపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసలు ఏం జరింగిందంటే.. తనకు ఉద్యోగం ఇప్పిస్తానని రూ.90లక్షలు తీసుకుని వైసీపీ(YCP) నేత, మాజీ మంత్రి మేరుగు నాగార్జున తనను మోసం చేశారంటూ విజయవాడకు చెందిన మహిళ తాడేపల్లి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. ఉద్యోగం ఇప్పించకపోవడంతో తాను ఇచ్చిన డబ్బులు వెనక్కి ఇవ్వాలని కోరగా.. విశాఖలో ఓ గిరిజన మహిళా టీచర్‌ను స్లో పాయిజన్ ద్వారా చంపేశానని.. తనకు అదే గతి పడుతుందని నాగార్జున వ్యక్తిగత సహాయకుడు మురళి బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. తనకు రావాల్సిన డబ్బులను ఇప్పించిన.. తనకు న్యాయం చేయాలని ఆమె వేడుకుంది.
కాగా ఎస్సీ వర్గానికి చెందిన మేరుగు నాగార్జున 2019 ఎన్నికల్లో వేమూరు నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం వైసీపీ అధికారంలోకి రావడంతో మంత్రివర్గ విస్తరణలో ఆయనకు మంత్రి పదవి దక్కింది. అప్పటి నుంచి వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు విశ్వాసపాత్రుడిగా ఉంటూ పార్టీలో కొనసాగుతున్నారు. అయితే 2024 ఎన్నికల్లో ఆయనను వేమూరు నుంచి సంతనూతలపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయించారు. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయ్ కుమార్ చేతిలో చిత్తుగా ఓడిపోయారు మేరుగ. తాజాగా ఆయనపై లైంగిక ఆరోపణల ఫిర్యాదు రావడంతో వైసీపీకి భారీ షాక్ తగిలినట్లైంది.