Chintakayala Ayyanna Pathrudu: సెప్టెంబర్ 14, 15 తేదీల్లో తిరుపతిలోని తాజ్ హోటల్‌లో జాతీయ మహిళా సాధికారిత సదస్సు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఈ సదస్సు ఏర్పాట్లపై తిరుపతి కలెక్టరేట్‌లో ఆయన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో కలిసి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 31 రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళా కమిటీలు ఉన్నాయని, ఈ కమిటీల ద్వారా వివిధ అంశాలపై చర్చ జరుగుతోందని తెలిపారు. ప్రజాప్రతినిధుల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ సదస్సులు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రతి సమస్యను స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్ ఒక్కరే పరిష్కరించడం సాధ్యపడదని, అందుకే సమిష్టిగా చర్చించే వేదికలుగా ఈ కార్యక్రమాలు అవసరమవుతున్నాయని వివరించారు.
ALSO READ: https://teluguprabha.net/andhra-pradesh-news/minister-narayana-said-good-news-to-tdp-cader-today/
ఈ సదస్సు నిర్వహణకు ముందుగా విశాఖపట్నం నగరాన్ని ఆలోచించినప్పటికీ, పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లా సూచనతో తిరుపతిలో నిర్వహించేందుకు తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో ప్రతి రాష్ట్రం నుంచి ఆరుగురు, ప్రతి అసెంబ్లీ నుంచి ఆరుగురు చొప్పున మహిళా ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారని, మొత్తం 300 మందికి పైగా సభ్యులు హాజరవుతారని వెల్లడించారు.
సభలో పాల్గొనేవారు రెండు ప్రధాన సమస్యలపై చర్చించి, ఆ నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లనున్నారని చెప్పారు. కార్యక్రమం ముగిసిన తర్వాత సభ్యులు తిరుమల, శ్రీకాళహస్తి, శ్రీహరికోట, శ్రీ సిటీ, చంద్రగిరి కోట వంటి ప్రముఖ ప్రాంతాలను సందర్శించనున్నారని తెలిపారు. ఈ పర్యటనలో అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా ఉండేలా అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా ఉప సభాపతి రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, చట్టసభల్లో, పదవుల కేటాయింపులో మహిళలకు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్‌లు తదితరులు పాల్గొన్నారు.


