World Water Day Bullaiah College: విశాఖ నగరంలోని బుల్లయ్య కళాశాల యాజమాన్యం, భారతి తీర్థ అనే సంస్థతో కలిసి ‘ప్రపంచ జల దినోత్సవం- 2026’ను ఘనంగా నిర్వహించింది. ‘నీరు-లింగ సమానత్వం, నీరు ప్రవహించే చోట సమానత్వం పెరుగుతుంది’ అనే థీమ్ ద్వారా విద్యార్థుల్లో అవగాహన కలిగించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ప్రకాశం బి. టాటా హాజరయ్యారు.

ప్రపంచ జల సమస్య.. మహిళలు, బాలికలపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని డా. ప్రకాసం బి. టాటా అభిప్రాయం వ్యక్తం చేశారు. వీరంతా నిత్యం 200- 250మిలియన్ గంటలు నీటిని సేకరించేందుకే వెచ్చిస్తున్నారని చెప్పారు. శుద్ధమైన తాగు నీరు, పారిశుద్ధ్యం ఒక మూలభూత మానవ హక్కు అని.. ఆరోగ్యం, విద్య, ఆర్థికాభివృద్ధికి ఇది ఎంతో అవసరమని ఆయన వివరించారు. నీటి పాలనలో మహిళల భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచ జల సమస్యల పరిష్కారానికి లింగ సున్నిత దృక్పథం అవసరమనే సందేశాన్నిచ్చిందని నిర్వాహకులు ప్రకటనలో స్పష్టం చేశారు.

