Ys Rajareddy:ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి మనవడు, వై.ఎస్. షర్మిల కుమారుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఇటీవల ఆయన తన తల్లి షర్మిలతో కలిసి కర్నూలు ఉల్లి మార్కెట్‌ను సందర్శించి, రైతుల సమస్యలు అడిగి తెలుసుకోవడం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది. మార్కెట్‌కు వెళ్ళడానికి ముందు అమ్మమ్మ విజయమ్మ ఆశీస్సులు తీసుకోవడం కూడా చర్చనీయాంశంగా మారింది.
వైఎస్సార్ కుటుంబం నుంచి అనేకమంది రాజకీయాల్లోకి రావడం, ఉన్నత పదవులు చేపట్టడం చరిత్రలో ఉంది. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి వైద్యుడిగా ఉండి రాజకీయాల్లోకి అడుగుపెట్టి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కుమార్తె షర్మిల కూడా సోదరుడు జగన్మోహన్ రెడ్డి కోసం పార్టీ బాధ్యతలు చేపట్టి, పాదయాత్ర చేసి పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేశారు. అయితే, తదనంతర కాలంలో ఏర్పడిన విభేదాల కారణంగా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీలో పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. ఆమె ఇటీవల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించడంలో కీలక పాత్ర పోషించారని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇప్పుడు రాజారెడ్డి రాజకీయ ప్రవేశంపై జరుగుతున్న చర్చకు ప్రధాన కారణం, జగన్మోహన్ రెడ్డితో షర్మిలకు ఉన్న విభేదాలేనని రాజకీయ వర్గాల అభిప్రాయం. గత కొంతకాలంగా రాజారెడ్డి రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు ఉన్నప్పటికీ, ఇప్పుడు అది వాస్తవరూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది. చిన్నతనంలో మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందిన రాజారెడ్డి, అమెరికాలో విద్యను పూర్తి చేసి, ఉద్యోగం కూడా చేశారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్‌లో చేరితే, భవిష్యత్తులో వైఎస్సార్సీపీకి ఆయన సవాల్ విసిరే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీయవచ్చు.


