Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Macherla: మాచర్లలో టీడీపీ నేతలపై వైసీపీ దాడి.. టీడీపీ ఆఫీస్ దహనం చేసిన వైసీపీ శ్రేణులు

Macherla: మాచర్లలో టీడీపీ నేతలపై వైసీపీ దాడి.. టీడీపీ ఆఫీస్ దహనం చేసిన వైసీపీ శ్రేణులు

Macherla: ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా మాచర్లలో ఉద్రిక్తత తలెత్తింది. టీడీపీ నేతలపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ అనే కార్యక్రమం చేపడుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా శుక్రవారం మాచర్ల టీడీపీ ఇన్‌ఛార్జి జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో, మాచర్ల పట్టణంలో ఈ కార్యక్రమం చేపట్టారు.

- Advertisement -

ఈ సందర్భంగా వైసీపీకి చెందిన మాచర్ల మున్సిపల్ ఛైర్మన్ వార్డులో టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. దీంతో అక్కడి వైసీపీ శ్రేణులు బ్రహ్మానందరెడ్డితోపాటు, టీడీపీ నేతలపై దాడి చేశాయి. రాళ్లు, కర్రలతో దాడికి యత్నించాయి. ఈ ఘటనలో పలువురు టీడీపీ నేతలకు గాయాలయ్యాయి. వెంటనే టీడీపీ శ్రేణులు కూడా దాడిని ప్రతిఘటించాయి. ఎదురుదాడికి పాల్పడ్డాయి. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ మరింత పెద్దదైంది. ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నాయి. దీంతో ఇక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వైసీపీ శ్రేణులు తాజాగా టీడీపీ ఆఫీసును తగలబెట్టాయి. టీడీపీ ఆఫీసులోనే బ్రహ్మానంద రెడ్డి ఇల్లు కూడా ఉంది. ఇక్కడికి చొరబడిన వైసీపీ శ్రేణులు ఫర్నీచర్ ధ్వంసం చేశారు.

మరోవైపు రైల్వే ట్రాక్ సమీపంలో ఆందోళనకారులు పలు కార్లను దహనం చేశారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు బ్రహ్మానందరెడ్డిని మాచర్ల నుంచి తరలించారు. ఈ అంశంలో టీడీపీ శ్రేణులు పోలీసులపై విమర్శలు చేశారు. వైసీపీ దాడికి పాల్పడుతున్నప్పటికీ, పోలీసులు చూస్తూ ఉండిపోయారని విమర్శించారు. ఈ ఘటనపై టీడీపీ, వైసీపీ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. టీడీపీ నేతలే తమపై దాడికి పాల్పడ్డారని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రస్తుతం టీడీపీ శ్రేణులు స్థానిక బ్రిడ్జిపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ నేత నారా లోకేష్ స్పందించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీలో అరాచక పాలన సాగుతోందని, దీనికి ఈ ఘటనే నిదర్శనమని నారా లోకేష్ అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News