Sajjala Comments On AP Police: వైఎస్సార్సీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడి త్వరలో కోలుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. దాడిని ఉద్దేశపూర్వకంగా, దుర్మార్గంగా చేశారని ఆరోపించిన సజ్జల, ఇది సాధారణ ఘటన కాదని, రాజకీయ లక్ష్యాలతోనే ప్రణాళికబద్ధంగా జరిగిందని అభిప్రాయపడ్డారు. దాడికి సంబంధించి సీసీ కెమెరా దృశ్యాలు భయానకంగా ఉన్నాయని వివరించారు. దాడికి సంబంధించిన సీసీ ఫుటేజీలు చూసిన తర్వాత పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నదో స్పష్టంగా తెలుస్తుందని చెప్పారు. ఈ ఘటనలో అంబటి మురళి పై కేసు నమోదు అయినప్పటికీ, దాడికి ప్రేరేపించిన ధూళిపాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా చిత్తశుద్ధిని కోల్పోయిందని, అధికార ప్రతాపానికి వినమ్రంగా వ్యవహరిస్తోందని సజ్జల ఆరోపించారు. వైఎస్సార్సీపీ నేతలపై దాడులు జరిగినా పోలీసులు స్పందించకపోవడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. నెల్లూరులో ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి జరిగినప్పటికీ, పోలీసుల నిర్లక్ష్యం కనిపించిందని చెప్పారు. గుడివాడలో జెడ్పీ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారికపై జరిగిన దాడిని కూడా పోలీసులు నిరోధించలేకపోయారని సజ్జల ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు తన హక్కులను వినియోగించుకోవాల్సిన హక్కు ఉన్నదని, కానీ వైసీపీ నేతల విషయంలో మాత్రం ఆ హక్కులను నిర్వీర్యం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు.
సీఎం జగన్ పర్యటనలపై కూడా..
మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ప్రజల మధ్యకి వెళ్ళిన ప్రతిసారీ వందల సంఖ్యలో కేసులు నమోదు చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. మామిడి యార్డులను మూసివేసిన వ్యవహారాన్ని కూడా ఆయన గుర్తుచేశారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అణచివేయడానికి చేసే కుట్రల్లో భాగమని వ్యాఖ్యానించారు. అంతిమంగా, తమపై జరుగుతున్న ఈ దాడులన్నీ ప్రజాస్వామ్యానికి సవాలుగా నిలుస్తున్నాయని, ప్రజలే చివరకు తగిన తీర్పు ఇస్తారని సజ్జల చెప్పారు. “ప్రజల సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం జగన్‌ను విమర్శించే హక్కు ఎలా పొందింది?” అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం భయభ్రాంతులను కలిగించేలా పాలన సాగిస్తోందని ఆరోపించారు.
కాగా సజ్జల వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. తమ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణికి పాల్పడదని, తమ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పని చేస్తుందని పేర్కొంటున్నారు. వైసీపీ నేతలు కావాలనే తమ నేతలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. హత్య, హింసాపూరిత రాజకీయాలు చేసేది వైసీపీ నేతలే అని.. దానికి నిదర్శనం ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలే నిదర్శనం అని పేర్కొన్నారు. వైసీపీ నేతలు ఇతరులను విమర్శించే ముందు తమ వీపు చూసుకోవాలని హితవు పలికారు.


